ఎండాకాలంలో మాత్రమే దొరికే తాటి ముంజల రుచిని ఒక్కసారి టేస్ట్ చేస్తే, మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. ఇవి రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందిస్తాయి. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉండటంతో చిన్నాపెద్దా అంతా వీటిని హాయిగా తినొచ్చు. ఈ తాటి ముంజలనే ‘టాడీ పామ్ ఫ్రూట్’, ‘ఐస్ యాపిల్’ అంటారు. మండు వేసవిలో ఈ సీజనల్ ఫ్రూట్ ను తింటే వేసవి తాపానికి చెక్ పెట్టొచ్చు. వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. అలాగే ఆరు అరటిపండ్లలో ఉండే పొటాషియం.. ఒక్క తాటి ముంజలో ఉంటుందట. అది శరీర బరువును అదుపులో ఉంచుతుంది. శరీరంలోని మలినాలను (టాక్సిన్స్) బయటకు పంపిస్తాయి ఈ ముంజలు. వీటిలో విటమిన్–బి, ఐరన్, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. రక్తప్రసరణ సక్రమంగా సాగడంతో పాటు బీపీని అదుపులో ఉంచి కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. అలాగే ఎముకలను బలంగా మార్చుతాయి. జీర్ణసంబంధిత సమస్యలు తొలగిపోతాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను నివారించడంలో నేచురల్ ట్రీట్ మెంట్ గా ఇవి పనిచేస్తాయి.
బరువు తగ్గాలనుకునే వాళ్లు ఈ ఐస్ యాపిల్స్‌ను ఫుల్ గా తినొచ్చు. ఎందుకంటే నీటిశాతం ఎక్కువగా ఉండే ముంజలను తినడం ద్వారా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఆకలి త్వరగా కాదు. అలాగే చికెన్ పాక్స్ తో బాధపడేవారు తాటిముంజలు తింటే శరీరంలో వేడి తగ్గుతుంది. తాటిముంజలను గర్భిణులు కూడా నిరభ్యంతరంగా తినొచ్చు. ఇవి వాళ్లలో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధక సమస్యను నివారిస్తుంది. ఎసిడిటీ సమస్యలను దూరం చేస్తుంది. అలాగే తాటి ముంజల్లో కేన్సర్ ను అడ్డుకునే గుణాలు ఉంటాయి. ఫైటో కెమికల్స్, ఆంతోసైనిన్ శరీరంలో ట్యూమర్స్, బ్రెస్ట్ కేన్సర్ సెల్స్ ను పెరగకుండా నిరోధిస్తాయి. షుగర్, హార్ట్, ఒబెసిటీ పేషెంట్లు సైతం ముంజలను లాగించొచ్చు. తాటిముంజల్లో క్యాలరీలు తక్కువ ఉన్నప్పటికీ ఫుల్ ఎనర్జీని అందిస్తాయి.