Breaking News

తాటిముంజలకు కేరాఫ్​ అల్లిపూర్

సారథి న్యూస్, నర్సాపూర్: మెదక్​ జిల్లాలో అల్లిపూర్ గ్రామం పేరు చెబితేనే.. ఠక్కున గుర్తుకొచ్చేది తాటి ముంజలే. ఇక్కడ వందల ఎకరాల్లో సహజసిద్ధంగా ఉన్న తాటిచెట్లు గ్రామానికి వన్నె తెచ్చేలా ఉన్నప్పటికీ కల్లుగీత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాయి. తాటి ముంజల్లో పోషక విలువలు పుష్కలంగా ఉండడంతో మంచి డిమాండ్ కూడా ఉంది. మండల కేంద్రానికి పది కి.మీ. దూరంలో ఉన్న అలీపూర్ గ్రామంలో ఎక్కువ విస్తీర్ణంలో తాటి వనాలు ఉన్నాయి. మే నెలలో వాటి అమ్మకాలతో ఈ ప్రాంతమంతా కళకళలాడుతుంది.

వేసవిలో ఉపాధి
రైతులు, గీత కార్మికులు తాటి వనాల వద్ద రూ.300కు వంద ముంజలు ఇస్తున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు వ్యాపారులు ఇక్కడ కొని శివ్వంపేట, నర్సాపూర్, తూప్రాన్, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో రూ.ఐదుకు ఒకటి, డజన్​కు రూ.50 చొప్పున అమ్ముతున్నారు. ముంజల విక్రయాల ద్వారా నెలరోజుల పాటు ఉపాధి దొరుకుతోంది. నర్సాపూర్– వెల్దుర్తి మెయిన్​ రోడ్డుకు ఇరువైపులా గ్రామశివారులో ఉన్న తాటి వనం పరిసర అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ప్రస్తుతం లాక్ డౌన్ ఉండడంతో తాటి ముంజలను విక్రయించేందుకు కొంత ఇబ్బంది పడుతున్నారు. వాటిని తినాలని చాలా మందికి ఉన్నా.. కరోనా నేపథ్యంలో కొంత వెనకడుగు వేస్తున్నారు.
అందని సర్కారు సాయం
ఇంతవరకు బాగానే ఉన్నా తాటివనాల ద్వారా ఉపాధి పొందుతున్న కల్లుగీత కార్మికులు, రైతులకు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందడం లేదు. రెండేళ్ల క్రితం అల్లిపూర్ గ్రామానికి చెందిన చింతకాయల సత్యనారాయణ, లంబడి లక్ష్మణ్ తాటి ముంజలు కోస్తుండగా చెట్టు పైనుంచి కిందపడి చనిపోయారు. పరిహారం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ ఎలాంటి పరిహారం అందలేదని బాధిత కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఆదుకోవాలని వారు కోరుతున్నారు.