బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతికేసు విచారణలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ రాకెట్ పై ఫోకస్ పెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే హీరోయిన్ రియా చక్రవర్తితో పాటు పలువురు డ్రగ్ డీలర్లను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనే, శ్రద్ధాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ లను ఎన్సీబీ అధికారులు విచారించారు. వీరితో పాటు దీపికా మేనేజర్ కరిష్మా కపూర్ ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబట్టాలను కూడా ప్రశ్నించారు. వారిని డ్రగ్స్ వ్యవహారాలకు సంబంధించిన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన ఎన్సీబీ అధికారులు.. పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ కొన్ని విషయాలకు వారు చెప్పిన సమాధానాలకు సంతృప్తి చెందని ఎన్సీబీ వీరిలో కొందరిని మళ్లీ విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయని నేషనల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఇదిలాఉండగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో భాగంగా అధికారులు నటీమణుల నుంచి వారి పర్సనల్ మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారని సమాచారం. దీంతో డ్రగ్స్ వ్యవహారాలను పక్కన పెడితే మొబైల్ ఫోన్లలో ఉండే మరిన్ని వ్యవహారాలు వెల్లడయ్యే అవకాశం ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి సీక్రెట్స్ అన్నీ మొబైల్స్ లో దాచుకుంటున్నారు. ఇక సెలబ్రిటీలు అయితే ఆర్థిక లావాదేవీల నుంచి తమ పర్సనల్ విషయాల వరకు అన్నిటింనీ అందులోనే దాచేస్తున్నారు. ఒక్కసారి మొబైల్ లోని ఏ విషయమైనా బయటకు వస్తే అది వైరల్ అయినట్లే అని చెప్పొచ్చు.
సుశాంత్ కేసులో రియా వాట్సాప్ చాట్.. దీపికా డ్రగ్ చాట్ మీడియాలో ఏ విధంగా సర్క్యూలేట్ అయిందో చూశాం. అందులోనూ ఈ కేసులో నాలుగు గోడల మధ్య జరుగుతున్న విషయాలు కూడా ఎప్పటికప్పుడు మీడియాకు లీక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్సీబీ ఆధీనంలో ఉన్న ఫోన్లలోని ఏ సమాచారం అయినా బయటకు పొక్కితే మాత్రం.. వారి జాతకాలన్నీ బట్టబయలవుతాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఎంతో సెక్యూరిటీ ఉందని వాట్సప్ చాటింగ్ నే బయటకు తెచ్చిన ఎన్సీబీ మొబైల్ ఫోన్లలోని మరింత సమాచారాన్ని బయటకు తీస్తుందేమో చూడాలి.