Breaking News

ట్రైనింగ్​ మొదలుపెట్టండి

  • 11 రకాల క్రీడల్లో ఔట్ డోర్​ ప్రాక్టీస్

న్యూఢిల్లీ: లాక్​ డౌన్​ తర్వాత వివిధ రకాల క్రీడల్లో ట్రెయినింగ్​ను మొదలుపెట్టేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్), స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్ వోపీ) పేరుతో మార్గదర్శకాలు విడుదల చేసింది. అథ్లెటిక్స్, హాకీ, బ్యాడ్మింటన్​తో కలిసి 11 రకాల క్రీడల్లో ఔట్ డోర్ ట్రెయినింగ్​కు అనుమతి ఇచ్చింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వెయిట్ లిఫ్టర్లు, ఆర్చర్లు, సైక్లిస్ట్​లు కూడా శిక్షణ తీసుకోవచ్చు. గతంలో మాదిరిగా కాకుండా టచ్ పాయింట్స్​ను బాగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, కాంటాక్ట్‌ క్రీడల్లో స్పారింగ్‌(ఒకరినొకరు తాకడం), బాక్సింగ్‌ రింగ్స్‌, సిమ్మింగ్‌ పూల్స్‌ను ఉపయోగించుకోవడంపై ఎస్‌వోపీ బ్యాన్‌ చేసింది. స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు, స్టేడియాలు ఓపెన్‌ చేసేందుకు కేంద్రహోం శాఖ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సాయ్‌.. ఎస్‌వోపీ వెలువరించింది. ఎస్‌వోపీ తక్షణమే అమల్లోకి వస్తున్నప్పటికీ, దేశవ్యాప్తంగా ప్రాక్టీస్ మొదలుపెట్టే అంశం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, స్థానిక క్రీడా సంఘాల చేతుల్లోనే ఉంటుంది.

‘ఎస్‌వోపీ ప్రోటోకాల్స్‌ తక్షణమే అమల్లోకి వస్తాయి. కానీ, లాజిస్టిక్స్‌ వచ్చేందుకు కొంత సమయం పడుతుంది. ఎస్‌వోపీ అనేది ఓ బ్రాడ్‌ డాక్యుమెంట్‌. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా దీన్ని మార్చుకోవచ్చు. కాబట్టి ఏ టైమ్‌లో అయినా స్టేట్‌ గవర్నమెంట్‌ గైడ్‌ లైన్స్‌ దీన్ని రద్దుచేయొచ్చు. ఎస్‌వోపీలో మేం ప్రతి అంశాన్ని క్లియర్‌గా వివరించాం’ అని సాయ్‌ సెక్రటరీ రోహిత్‌ భరద్వాజ్‌ చెప్పారు. దేశంలో స్పోర్టింగ్‌ యాక్టివిటీని రీస్టార్ట్‌ చేసేందుకు ఎస్‌వోపీ మొదటి అడుగు అన్నారు. భరద్వాజ్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ రూపొందించిన ఎస్‌వోపీ ప్రకారం.. అథ్లెట్లు క్రీడాపరికరాలు ఉపయోగించిన ప్రతీసారి వాటిని సూక్ష్మజీవ రహితం చేయాలి. జిమ్​లను షిఫ్టుల వారీగా ఉపయోగించుకోవాలి. అథ్లెట్లు, స్టాఫ్‌ ఆరోగ్య సేతు యాప్‌ తప్పనిసరిగా వాడాలి. అథ్లెటిక్స్​లో హైజంప్‌, లాంగ్‌ జంప్‌, ట్రిపుల్‌ జంప్‌, పోల్‌వాల్ట్‌ పిట్‌ ఒక్కరు మాత్రమే వాడాల్సి ఉంటుంది.