Breaking News

టీ20 వరల్డ్​కప్​ వాయిదా?

  • వచ్చే వారం ఐసీసీ అధికారిక ప్రకటన


న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు ఇప్పటికే పలు టోర్నీల రద్దుతో అస్తవ్యస్తమైన క్రీడా ప్రపంచానికి ఇప్పుడు మరో దెబ్బ పడనుంది. ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్​ కూడా వైరస్​ ఖాతాలో పడేలా కనిపిస్తోంది. అక్టోబర్​, నవంబర్​లో జరగాల్సిన ఈ టోర్నీని వాయిదావేసే దిశగా ఐసీసీ వేగంగా అడుగులు వేస్తోంది. ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు జరిగే గవర్నింగ్​ బాడీ సమావేశంలో దీనిపై తుదినిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ ఈవెంట్​ను వాయిదా వేస్తే తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై కూడా సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతాని ఐసీసీ, క్రికెట్​ ఆస్ర్టేలియా(సీఏ) మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోందని సమాచారం.
వచ్చే ఏడాది బెటర్​
కరోనా దెబ్బకు ఈ టోర్నీ వాయిదావేసినా పెద్దగా ఇబ్బందులు లేవని చెబుతున్న ఆస్ర్టేలియా.. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిలో మాత్రం ఈవెంట్​ను నిర్వహించాలని పట్టుదలగా కనిపిస్తోంది. ఇదే జరిగితే ఐపీఎల్​ను ఏప్రిల్​లో మొదలుపెట్టాల్సి ఉంటుంది. దీనివల్ల ఇండియాలో ఇంగ్లండ్​ పర్యటన సందిగ్ధంలో పడుతుంది. దీనికి టీవీ ప్రత్యక్ష ప్రసారదారులు ఒప్పుకోకపోవచ్చు. రెండో ప్రత్యామ్నాయంగా ఈ ఏడాది టోర్నీని భారత్​లో నిర్వహించడం, ఇక్కడ జరగాల్సిన 2022 టోర్నీని ఆస్ర్టేలియాకు తరలించడం. అంటే పరస్పరం అంగీకారంతో టోర్నీలను మార్చుకోవడం. దీనికి బీసీసీఐ ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే ఈ ఏడాది చివరిలో నాలుగు టెస్ట్​ల సిరీస్​ కోసం ఆసీస్​కు వెళ్లాలని బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ రెండు కాకుండా టోర్నీని 2022లో నిర్వహించడం మూడో ప్రత్యామ్నాయం. ఆ ఏడాదిలో ఐసీసీకి సంబంధించిన వేరే టోర్నీలు కూడా లేకపోవడం అనుకూలాంశం. అయితే ఈ మూడింటిలో ఆస్ర్టేలియా దేనిని ఎంచుకుంటుందో చూడాలి. ఇప్పటికైతే వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్​ విండో కోసమే ఆస్ర్టేలియా పట్టుపట్టే అవకాశాలున్నాయి.
ఐపీఎల్​కు ఓకే
టీ20 ప్రపంచకప్​ను అధికారికంగా వాయిదా వేస్తే.. అక్టోబర్​, నవంబర్​ విండోను ఉపయోగించుకోవాలని బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోంది. ఈ విండోలో ఐపీఎల్​ను నిర్వహించాలని భావిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మిగతా బోర్డులు కూడా బీసీసీఐకి ఎదురుచెప్పే సాహసం చేయలేవు. కాబట్టి ఓ రకంగా ఐపీఎల్​కు మార్గం సుగమమైనట్లే. అవసరమైతే విదేశీ ప్లేయర్ల కోసం చార్టెడ్​ విమానాలు నడిపేందుకు కూడా బీసీసీఐ సిద్ధమవుతోందని సమాచారం. ఐపీఎల్​ను నిర్వహించడంతో దాదాపు రూ.నాలుగువేల కోట్ల రెవెన్యూ సమకూరుతుందని, అప్పుడు మిగతా బోర్డులకు కూడా ఆర్థికసాయం అందజేయొచ్చని భావిస్తున్నారు. ఏదేమైనా మూడురోజుల పాటు వీడియో కాన్ఫరెన్స్​లో జరిగే ఐసీసీ కీలక సమావేశాల్లో ఏదో ఒకటి తేలనుంది. ఇక ఐసీసీ కొత్త చైర్మన్​ ఎంపికపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న చైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌కు మరో రెండునెలలు పొడిగిస్తారనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి.