ముంబై: టీవీ చానళ్లలో టీఆర్పీ కుంభకోణం నేపథ్యంలో బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చి కౌన్సిల్(బార్క్) కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని భాషల్లోని వార్తా చానళ్లకు ప్రతివారం ఇచ్చే రేటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. 12వారాల పాటు (మూడు నెలలు) రేటింగ్‌ను ఇవ్వబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం టీవీ రేటింగ్ ఇవ్వడానికి గల ప్రమాణాలను సమీక్షించి, రేటింగ్ ప్రక్రియను ఆధునిక సాంకేతికత సాయంతో మెరుగుపర్చాలని భావిస్తున్నట్టు తెలిపింది. బార్క్ నిర్ణయాన్ని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్(ఎన్బీఏ) స్వాగతించింది. బార్క్ నిర్ణయం సాహసోపేతమైనదని, సరైందని వ్యాఖ్యానించింది. ఈ 12 వారాల్లో రేటింగ్ ప్రమాణాలను పూర్తిగా సమీక్షించి సమగ్ర మార్పులు చేయాలని ఈ సందర్భంగా కోరింది. తప్పుడు టీఆర్పీలతో మోసాలకు పాల్పడుతున్నారని ముంబై పోలీసులు రిపబ్లిక్ టీవీ సహా మూడు టీవీ చానళ్లపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
హైకోర్టులపై నమ్మకం ఉంచాలి
టీఆర్పీ కుంభకోణం కేసులో పోలీసులు తమపై కేసు నమోదుచేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన రిపబ్లిక్ మీడియా గ్రూప్‌కు నిరాశ మిగిలింది. రిపబ్లిక్ టీవీ పిటిషన్‌ను విచారణకు స్వీకరించడానికి ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసుపై బాంబే కోర్టుకు వెళ్లాలని బెంచ్ సూచించింది. ‘ఇలాంటి కేసుల్లో నేరుగా సుప్రీం కోర్టు విచారణ జరపడం ప్రజల్లోకి వేరే రకమైన సంకేతాలను పంపుతుంది. హైకోర్టుల మీద విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉంది’ అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. టీఆర్పీ వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని ఐటీ పార్లమెంటరీ ప్యానల్ ప్రసార భారతి, ఎన్బీఏ, పీసీఐ అభిప్రాయాలను కోరింది.
- October 17, 2020
- Archive
- జాతీయం
- BARC
- BROADCAOSTERS
- NBA
- TRP
- ఎన్బీఏ
- టీఆర్పీ
- న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్
- ప్రసారభారతి
- బార్క్
- Comments Off on టీఆర్పీ రేటింగ్ బంద్