Breaking News

జ్యేష్ఠం.. విశిష్టమాసం

చాంద్రమానం ప్రకారం చైత్ర, వైశాఖ మాసాల తర్వాత వచ్చే జ్యేష్ఠమాసం కూడా కొన్ని ముఖ్యమైన వ్రతాలు, పర్వదినాలకు వేదికగా కనిపిస్తుంది. పితృదేవతల రుణం తీర్చుకోవడానికి, పాపాలను పరిహరించుకోవడానికి, దైవసేవలో తరించేందుకు అవసరమైన కొన్ని పుణ్యతిథులు మనకు ఈ మాసంలోనే కనిపిస్తాయి.
జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టమైందిగా చెబుతారు. ఈ మాసంలో తనను ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని అంటారు. బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమపిండితో తయారుచేసి ఈ నెలరోజుల పాటు పూజించడం ద్వారా విశేషమైన ఫలితాలను పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
పార్వతీదేవి ఆచరించిన రంభావ్రతం, వివాహిత స్త్రీలు ఆచరించే అరణ్యగౌరీ వ్రతం, గంగానది స్నానంతో పదిరకాల పాపాలను హరించే దశాపాపహర దశమి, త్రివిక్రమ ఏకాదశి పేరుతో పిలిచే నిర్జల ఏకాదశి భక్తకోటిపై ప్రభావం చూపుతుంటాయి. అలాగే సూర్యుడిని ఆరాధించే మిథున సంక్రమణం, వ్యవసాయ పనులకు శుభారంభాన్ని పలికే ఏరువాక పున్నమి ఈ మాసంలోనే పలకరిస్తుంటాయి.
ఇక దానధర్మాలకు అవకాశమిస్తూ విశేష పుణ్యఫలాలను ప్రసాదించే జ్యేష్ఠ పౌర్ణమి, శ్రీమహా విష్ణువు ఆరాధనలో తరింపజేసే అపర ఏకాదశి ఈ మాసాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఇలా జ్యేష్ఠమాసం ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో విశేషాలను సంతరించుకుని, పుణ్యఫలాలను అందిస్తూ పునీతులు చేస్తూ ఉంటుంది.

::దిండిగల్​ ఆనంద్ శర్మ,
సీనియర్​ జర్నలిస్ట్​
96660 06418