సారథి న్యూస్, నారాయణఖేడ్: రాష్ట్ర సర్కార్ నియంత్రిత పంటసాగు విధానం ద్వారా రైతులు పత్తి, కంది పంటలు సాగుచేయాలని ప్రభుత్వం సూచించిన కొద్దిరోజులకే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని పలు మండలంలో నకిలీ పత్తి విత్తనాలు దందా జోరుగా కొనసాగుతోంది. నారాయణఖేడ్ మండలంలోని ఆబ్బెంద గ్రామం, కంగ్టి మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో గోకులకృష్ణ సీడ్స్ పేరుతో నాసిరకం పత్తి విత్తనాలు దర్శనమిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఎమ్మార్పీ లేకుండా ఉన్న పత్తి బ్యాగులను అమ్ముతున్నారు. నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే ఉపేక్షించేది లేదని, అలాంటి వారి తాట తీస్తామని ఓ వైపు రాష్ట్రప్రభుత్వం హెచ్చరిస్తున్నా ఇవేమీ వ్యాపారులు, దళారుల చెవికెక్కడం లేదు. అనుమతి లేని గోకుల్ కృష్ణ విత్తనాలను రూ.వెయ్యికు ఒకటి చొప్పున విక్రయిస్తూ అమాయక రైతులను నిలువునా మోసగిస్తున్నారు. ఆబ్బెంద గ్రామంలో ఓ వ్యాపారి ‘నేనింతే అన్నట్లు’ రైతుల నుంచి సొమ్ము చేసుకుంటున్నాడు.
తనిఖీలు చేసినా..
నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లోని విత్తన దుకాణాల్లో అగ్రికల్చర్, రెవెన్యూ, పోలీసు అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. నాసిరకం సీడ్స్ అమ్మితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించినా షాపుల యజమానులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా నకిలీ విత్తనాల విక్రేతల ఆటకట్టి.. తాము నష్టపోకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.
- June 8, 2020
- Top News
- తెలంగాణ
- COTTON SEEDS
- NARAYAKHED
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
- పత్తి విత్తనాలు
- Comments Off on జోరుగా నకిలీ పత్తి సీడ్స్ విక్రయం