Breaking News

జైనుల నెలవు.. పార్శ్వీనాథుడి కొలువు

సారథి న్యూస్, మెదక్: జైనమతం గురించి ప్రస్తావనకు రాగానే ఠక్కున స్ఫురణకు వచ్చేది కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణ బెలగోళా, మధ్యప్రదేశ్‌‌ రాష్ట్రంలోని గ్వాలియర్‌‌.. ఎందుకంటే అక్కడ జాతీయ స్థాయిలో ప్రసిద్ధిగాంచిన జైన మందిరాలు కొలువై ఉన్నాయి. ఇపుడు మన తెలంగాణ రాష్ట్రంలోని ఓ జైనమందిరం సైతం జైనులకు ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా దేశవ్యాప్త గుర్తింపు సాధించింది.

చారిత్రక నేపథ్యం

11వ శతాబ్దంలో ఉమ్మడి మెదక్‌‌ జిల్లాలోని పలు ప్రాంతాలు కళ్యాణి చాళుక్యుల ఏలుబడిలో ఉండేదని చరిత్ర చెబుతోంది. ప్రస్తుత సంగారెడ్డి జిల్లా పరిధిలోని పటాన్‌‌చెరు, మెదక్‌‌ జిల్లా పరిధిలోని మండల కేంద్రమైన అల్లాదుర్గం, కొల్చారం గ్రామాల్లో ఆ కాలంలో జైనమతం వర్ధిల్లినట్టు ఆధారాలు ఉన్నాయి. అప్పట్లో సాపాలదక్ష దేశంగా పేరుగాంచిన ఈ ప్రాంతం జైన మతానికి ఆయువుపట్టుగా ఉండేదట. ఈ ప్రాంతాన్ని ఏలిన చాళుక్యుల రాజు త్రిభువన వల్లభుడు ఆయా ప్రాంతాల్లో శివ, జైన దేవాలయాలను నిర్మించినట్టు ప్రతీతి. కొల్చారం గ్రామంలో ఎక్కడ తవ్వకాలు జరిపినా శివ, జైనమత సంబంధిత శిలావిగ్రహాలు, ఆలయ ఆనవాళ్లు లభ్యమవుతుండడంతో ఇందుకు బలం చేకూరుస్తోంది.

తవ్వకాల్లో లభ్యం

1984లో కొల్చారంలోని పురాతన వీరభద్రాలయం పక్కన ఇళ్ల నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా పార్వ్శీనాథుడి ఏకశిలా విగ్రహం బయటపడింది. నల్లరాతితో చెక్కిన తొమ్మది అడుగుల పొడవు, రెండు టన్నుల బరువు కలిగి ఏడుసర్పాల పడగ నీడలో చెక్కిన ఈ శిలావిగ్రహం జైన మత 23వ తీర్థంకరుడైన పార్వ్శీనాథునిదిగా పురావస్తుశాఖ అధికారులు నిర్ధారించారు. 11వ శతాబ్దంలో తయారైందిగా భావిస్తున్న ఈ విగ్రహం కళ్యాణి చాళుక్యుల కాలానికి చెందినదిగా గుర్తించారు. ఇలాంటి విగ్రహాలు దేశంలో చాలా అరుదుగా ఉన్నాయట.

సుందర మందిరం
1997లో ఆలిండియా జైన్‌‌ దిగంబర్ మహాసభ జంట నగరాల్లోని జైనమత సంస్థల, వ్యాపారుల సహకారంతో కొల్చారంలోనే పార్వ్శీనాథుడి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు మెదక్‌‌‒ హైదరాబాద్‌‌ ప్రధాన రహదారిపై స్థలం కొనుగోలు చేసి ’శ్రీ పార్వ్శీనాథ దిగంబర్‌‌ జైన్‌‌ అతిక్షయ్‌‌ క్షేత్ర్‌‌‘ పేరుతో చేపట్టిన ప్రాజెక్టు 2003లో పూర్తయింది. అప్పట్లోనే సుమారు కోటి రూపాయలు వెచ్చించి సుందరమైన ఆలయాన్ని నిర్మించారు.

కళాత్మకం

తమిళనాడు రాష్ట్రానికి చెందిన నిపుణులైన నిర్మాణరంగ కళాకారులను రప్పించి జైన మందిరాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఆలయం ముందు ప్రధాన ద్వారానికి ఎదురుగా ఆకర్షణీయమైన పాలరాతి శిల్పాలతో ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ ఆవరణలో వివిధ రకాల పువ్వుల చెట్లను పెంపొందింపజేసి ఆహ్లాదభరితంగా తయారుచేశారు.

ఉత్సవాలు

కొల్చారం జైన మందిరంలో జైన మత సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా నిత్య పూజలు జరుగుతుండగా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నివసించే జైనులతోపాటు, వివిధ రాష్ట్రాల నుంచి సైతం జైన మతస్థులు ఇక్కడికి తరలివస్తుంటారు. ముఖ్యంగా జైనులు దైవసమానులుగా భావించి అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించే దిగంబర జైన గురువులు దేశ పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చిన సందర్భాల్లో ఎంతో వైభవంగా ఉత్సవాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

పర్యాటక కేంద్రంగా
సుందరమైన జైన మందిరం నిర్మించడం, అరుదైన జైనమత తీర్థంకరుడు పార్వ్శీనాథుడి విగ్రహం కొలువై ఉండడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏడాది పొడుగునా ఎంతో మంది ఈ ఆలయ సందర్శనకు వస్తుంటారు. దీంతో కొల్చారం జైన మందిరం జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది.