సారథి న్యూస్,ఖమ్మం: ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. ఈ విషాదకర సంఘటన మంగళవారం ఖమ్మం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నల్లమోతు అప్పారావు (45) తన కొడుకు తేజు (20), మేనల్లుడు వినయ్ (19)తో కలిసి మంగళవారం పొలంలో కూరగాయల పంటకు పురుగు మందు పిచికారీ చేశారు. అనంతరం పక్కనే ఉన్న రేపాక చెరువులోకి కాళ్లు కడుక్కునేందుకు వెళ్లారు .
ఈ క్రమంలో తేజు చెరువులోకి దిగగా కాలు జారి మునిగిపోయాడు. తేజును కాపాడేందుకు వినయ్ చెరువులోకి దిగాడు. ఇద్దరు మునిగిపోతుండగా వారిని రక్షించేందుకు అప్పారావు చెరువులోకి దిగాడు. ఈ క్రమంలో చెరువులో మునిగి ముగ్గురు మృతిచెందారు. గ్రామ ప్రజలు వీరి మృతదేహాలను చెరువు నుంచి వెలికితీశారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాన్ని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పరామర్శించారు.