ఢిల్లీ: కరోనా సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరవుతున్న వ్యాపారవర్గాలకు కేంద్రప్రభుత్వం కొంత ఊరట కల్పించింది. బ్యాంకు ఖాతాల్లో నగదు లేక చెక్‌బౌన్స్ కావడం, రుణాల చెల్లింపు నిబంధనల ఉల్లంఘన తదితర చర్యలను నేరాల జాబితా నుంచి తొలగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన 19 చట్టాల్లో సవరణలు చేయనున్నది. వీటిపై సంబంధిత వర్గాలు జూన్ 23లోగా తమ అభిప్రాయాలు తెలపాల్సి ఉంటుంది. చిన్న నేరాలను డీక్రిమినలైజ్ చేయడం, వ్యాపారవర్గాలకు ఎంతో తోడ్పడుతుందని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో అభిప్రాయపడింది.
ప్రస్తుతం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881లోని సెక్షన్ 138 కింద ఖాతాలో తగిన బ్యాలెన్స్ లేక చెక్ బౌన్స్ అయితే దాన్ని జారీ చేసిన వ్యక్తి నేరం చేసినట్లుగా పరిగణించి రెండేళ్ల దాకా జైలు శిక్ష లేదా చెక్ పరిమాణానికి రెట్టింపు పెనాల్టీ విధించవచ్చు. లేదా జైలుశిక్ష, జరిమానా రెండూ విధించవచ్చు. తాజా ప్రతిపాదనల ప్రకారం దీన్ని సవరించే అవకాశం ఉంది. ఎల్ఐసీ విషయానికొస్తే ఆ సంస్థ పత్రాలు, ఖాతాలు లేదా ఇతరత్రా ప్రాపర్టీ ఏదైనా చట్టవిరుద్ధంగా ఎవరైనా తమ వద్ద ఉంచుకుంటే ఏడాది దాకా జైలు శిక్ష, రూ. 1,000 దాకా జరిమానా లేదా రెండూ కలిపి విధించే అవకాశం ఉంది. దీన్ని కూడా సవరించే అవకాశం ఉన్నట్టు సమాచారం.