Breaking News

గౌరవెల్లి.. వరప్రదాయిని

  • ఇప్పటికే 85శాతం మేర పూర్తి
  • మెట్టప్రాంతానికి గోదావరి జలాలు
  • 1.06లక్షల ఎకరాలకు సాగునీరు

సారథి న్యూస్​, హుస్నాబాద్​: మెట్టప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన గౌరవెల్లి రిజర్వాయర్ వనులు తుదిదశకు చేరాయి. త్వరితగతిన వనులు పూర్తిచేసి దసరాలోగా రిజర్వాయర్ లోకి గోదావరి జలాలను విడుదల చేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు పనులు కొనసాగుతున్నాయి. ఈ రిజర్వాయర్ కుడికాల్వ ద్వారా 90వేల ఎకరాలు, ఎడమ కాల్వ ద్వారా 16వేల ఎకరాలకు మొత్తంగా 1.06 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందిస్తారు. సిద్దిపేట, కరీంనగర్, జనగామ, వరంగల్ అర్చన్ జిల్లాలకు ఈ రిజర్వాయర్ తో ప్రయోజనం కలగనుంది. ప్రధానంగా మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గానికి వరప్రదాయినిగా ఈ ప్రాజెక్టు మారనుంది.

పూర్తయిన గౌరవెల్లి రిజర్వాయర్ వాటర్ డెలివరీ సిస్టం(ఫైల్​)


సీఎం కేసీఆర్​ సమీక్ష
ఇటీవల కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ గౌరవెల్లి రిజర్వాయర్ పనుల పురోగతిపై ప్రస్తావించారు. ఆ తర్వాత ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ తో పాటు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని దిశానిర్దేశం చేశారు.
1.06లక్షల ఎకరాలు సస్యశ్యామలం
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర(మిడ్​ మానేర్) జలాశయం నుంచి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి ప్రాజెక్టులోకి గోదావరి జాలాలు గతేడాది వచ్చి చేరాయి. అక్కడి నుంచి ఓపెన్ సొరంగం ద్వారా గౌరవెల్లి రిజర్వాయర్ కు గోదావరి జలాలు రానున్నాయి. గత ప్రభుత్వాల హయంలో గౌరవెల్లి రిజర్వాయర్ సామర్థ్యం 1.41 టీఎంసీలు ఉండగా, ప్రాజెక్టుల రీడిజైన్ లో భాగంగా 8.23 టీఎంసీల సామర్థ్యానికి పెంచారు. ఈ రిజర్వాయర్ కింద 1.06 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుంది. సిద్దిపేట, కరీంనగర్, జనగామ, వరంగల్ అర్బన్ జిల్లాల్లోని పలు మండలాలకు రిజర్వాయర్​తో ప్రయోజనం కలగనుంది. తోటపల్లి రిజర్వాయర్ నుంచి సుమారు 11కి.మీ. ఓపెన్ కెనాల్, నారాయణపూర్ నుంచి సుమారు16 కి.మీ.దూరం సొరంగం ద్వారా రేగొండ సర్జిపూల్ కు నీళ్లు చేరుతాయి. రేగొండ వద్ద 110 మీ.లోతు, 25 మీ. వెడల్పు 50 మీ. పొడవుతో సర్జిపూల్ పంపును నిర్మించగా ఈ పనులు చివరి దశకు చేరాయి. సర్జిపూల్ నుంచి 130 మీ. లోతు,17 మీ. వెడల్పు, 65 మీ. పొడవుతో నిర్మించిన పంపుహౌస్ లోకి గోదావరి జలాలు వస్తాయి. ఇక్కడ 32 మొగావాట్లు కలిగిన మూడు మోటార్లను బిగించి వాటి సహాయంతో గౌరవెల్లి రిజర్వాయర్ లోకి గోదావరి జలాలను విడుదల చేస్తారు.

పూర్తికావస్తున్న ప్రాజెక్టు కుడి కాల్వ పనులు


85శాతం పనులు పూర్తి
గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుండగా ప్రస్తుతం 85శాతంపైగా పనులు పూర్తి చేశారు. దసరాలోపు రిజర్వాయర్ లోకి గోదావరి జాలాను అందించాలనే ప్రధాన లక్ష్యంతో పనులు చేపడుతున్నారు. ఓపెన్ కెనాల్ సొరంగ పనులు పూర్తయ్యాయి. సర్జిపూల్, పంపుహౌస్ పనులు చివరిదశలో ఉన్నాయి. రిజర్వాయర్ బండ్ నిర్మాణంలో భాగంగా112.65 క్యూబిక్ మీటర్ల మట్టిని, 24,281 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 24,830 మీటర్ల రివెట్ మెంట్ 4,82,979 క్యూబిక్ మీటర్ల ఇసుక పనులు పూర్తిచేశారు.
8.23 టీఎంసీల నీటిసామర్థ్యం
గౌరవెల్లి రిజర్వాయర్ 8.23 టీఎంసీలు సామర్థ్యం కలిగి ఉండగా, రిజర్వాయర్ పొడవు 10.56 కి.మీ, 41 మీ. ఎత్తుతో అక్కడికక్కడే రెండు కి.మీ. పొడవు కలిగిన గుట్టలను కలుపుకుని రాతికట్టను నిర్మించారు. ప్రాజెక్టు నిర్మాణానికి 3,870 ఎకరాల భూమి అవసరం కాగా 3,420 ఎకరాల భూమిని భూసేకరించారు. ఈ రిజర్వాయర్ కింద పూర్తిగా ముంపునకు గురవుతున్న గుడాటిపల్లి, తెనుగుపల్లి, మద్దెలపల్లి, కొత్తపల్లితో పాటు సోమజితండా, సేవ్యానాయక్ తండా, బొంద్యానాయక్ తండా, జాలుబాయితండా, చింతల్ తండా, తిరుమల్ నాయక్ తండాలు ఉన్నాయి. రిజర్వాయర్ గుడి కాల్వ ద్వారా 90 వేల ఎకరాలు, ఎడమ కాల్వ ద్వారా 16వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
మైలురాయిగా గౌరవెల్లి ప్రాజెక్టు
సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయిస్తున్నాం. గోదావరి జలాలతో మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే కాకుండా గౌరవెల్లి ఈ ప్రాంతానికి ఒక్క మైలురాయి కాబోతుంది. సీఎం కేసీఆర్ స్వయంగా రిజర్వాయర్ ను సందర్శించి రీడిజైన్ చేసి 8.23 టీఎంసీలకు పెంచారు. గౌరవెల్లి రిజర్వాయర్ ఈ ప్రాంతానికి వరప్రదాయినిగా మారనుంది.
– వొడితెల సతీశ్ కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే