తెలంగాణ, మెదక్, లోకల్ న్యూస్
- మహిళ మృతి.. ఎగిరిన ఇంటి పైకప్పు రేకులు
- రెక్కల కష్టం నీటిపాలు
సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలోనీ పలు ప్రాంతాల్లో శుక్రవారం ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీవర్షం కురిసింది. గాలి దుమారానికి ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపడి బలమైన గాయం కావడంతో ఓ మహిళ మృతిచెందింది. ఆయా ప్రాంతాల్లో పెద్దమొత్తంలో ధాన్యం తడిసిపోయింది. మెదక్ పట్టణంలో బలమైన గాలులతో పాటు వడగళ్ల వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
ఈదురు గాలుల తాకిడికి పట్టణ శివారులో కొత్త కలెక్టరేట్ నిర్మిస్తున్న చోట షెడ్ రేకులు ఎగిరిపడడంతో అక్కడే పనిచేస్తున్న జెంసీ బాయి(30) అనే మహిళా కూలీ తీవ్రంగా గాయపడి చనిపోయింది. మెదక్, హవేలీ ఘనపూర్, రామాయంపేట, కొల్చారం, పాపన్నపేట మండలాల్లోనూ భారీవర్షం కురిసింది.
రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామంలో ఓ ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. అలాగే రామాయంపేట మండలం కాట్రియాలలో భారీవర్షం కురవడంతో కొనుగోలు కేంద్రంలో వడ్లు, మొక్కజొన్న తడిసిపోయాయి. మెదక్ మండలం అవసులపల్లి, వెంకటాపూర్ గ్రామంలో భారీవర్షం పడి కొనుగోలు కేంద్రాలు నీట మునిగాయి. రైతులు ఆరబోసిన ధాన్యం, తూకం వేసి సంచుల్లో నింపి పెట్టిన ధాన్యం కూడా తడిచిపోయింది.