జైపూర్: రాజస్థాన్ రాజకీయ సంక్షోభంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆడియోలో ఉన్న గొంతు అతనిదే అని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ అన్నారు. ఈ సందర్భంగా బీజేపీకి ఐదు ప్రశ్నలు సందించారు. ‘గజేంద్ర సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తన గురించి తెలిసిన వాళ్లే అది ఆయన వాయిస్ అని గుర్తుపట్టారు. అలాంటిది ఆయన ఆ పదవిలో ఎలా కొనసాగుతున్నారు? అది తన వాయీస్ కాదని చెబుతున్న షకావత్ శ్యాంపిల్ వాయీస్ ఇచ్చి విచారణ పూర్తయ్యేవరకు పదవికి దూరంగా ఉండాలి’ అని అజయ్ మాకన్ డిమాండ్ చేశారు.
రాజస్థాన్ కేబినెట్‌లోని మాజీ మంత్రులు భన్వర్‌లాల్‌శర్మ, విశ్వేంద్ర సింగ్‌ను వాయీస్ ఇవ్వకుండా బీజేపీ ఎందుకు ఆపిందో వివరించాలన్నారు. ఈ కేసులో ఇంకా చాలా మంది పెద్దవాళ్లు ఉన్నారని, వాళ్లను తప్పించేందుకే బీజేపీ సీబీఐ విచారణ అడుగుతోందని అజయ్ ఆరోపించారు. ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకు ఒప్పుకున్న రూ.25 నుంచి రూ.35 కోట్ల నల్ల ధనం ఎక్కడ నుంచి వచ్చిందో బీజేపీ చెప్పాలన్నారు. సచిన్ పైలెట్ ఎమ్మెల్యేలతో తమకు సంబంధం లేదని పదే పదే చెబుతున్నా బీజేపీ హర్యానా, ఢిల్లీ పోలీసుల సహకారంతో ఎమ్మెల్యేలను ఎందుకు కాపాడుతుందో చెప్పాలన్నారు. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ ఎమ్మెల్యేలతో మాట్లాడిన ఆడియో టేప్స్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ మేరకు తమ పార్టీకి చెందిన ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలు, కేంద్రమంత్రిపై కాంగ్రెస్ కేసు పెట్టింది.