Breaking News

క్రికెట్​తో జూదం ఆడాను

  • ఎన్సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్

కలకత్తా: ఓవైపు చదువు.. మరోవైపు క్రికెట్.. ఈ రెండింటిలో ఏదీ తీసుకోవాలో తెలియక చాలా సతమతమయ్యానని టీమిండియా మాజీ కెప్టెన్, ఎన్సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ఆ సమయంలో క్రికెట్​తో జూదం ఆడానని చెప్పాడు. ‘17 ఏళ్ల వయసులో నాకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడే అవకాశం వచ్చింది. ఇది జరిగిన ఐదేళ్ల తర్వాత టీమిండియా నుంచి పిలుపువచ్చింది. అప్పటివరకు కెరీర్ ఎలా సాగుతుందోనని సందేహాలు ఉండేది. అభద్రతాభావం ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది. క్రికెట్ కోసం చదువును త్యాగం చేస్తున్నాననే భావన కలిగేది. కానీ క్రికెట్లో విజయవంతమయ్యాకా.. నాకు ఈ బాధ తొలిగిపోయింది. అప్పట్నించి నా డిగ్రీని ఉపయోగించుకునే అవకాశం కూడా రాలేదు. ఇందులో నేను లక్కీ అనే చెప్పొచ్చు’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు.

మానసిక సమస్యలకు చెక్
యువ క్రికెటర్లకు కెరీర్ ఆరంభంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఎన్సీఏ ముందుడగు వేసిందని ద్రవిడ్ తెలిపారు. బీసీసీఐ నాన్ కాంట్రాక్ట్, అండర్–19 క్రికెటర్లు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలను పరిష్కరించామన్నాడు. ఇందుకోసం మానసిక నిపుణుల సాయం తీసుకున్నామని చెప్పాడు. ‘ప్రస్తుతం ఉన్న అనిశ్చితి యువ క్రికెటర్ల మానసిక స్థితిపై బాగా ప్రభావం చూపుతుంది. దీనిని పరిష్కరించే సత్తా కోచ్‌లకు ఉండదు. అందుకే మేం మానసిక నిపుణులతో మాట్లాడించాం. ఈ రోజుల్లో యువతరం మానసికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటుంది. వాటిని బయటకు చెప్పుకోలేకపోతున్నారు. దీనివల్ల అధిక ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్నారు. అయితే గతంతో పోలిస్తే ఇటీవల మానసిక అనారోగ్యంపై బహిరంగంగా మాట్లాడే వారి సంఖ్య పెరిగింది. ఇది మంచి పరిణామం’ అని ద్రవిడ్‌ పేర్కొన్నాడు. యువక్రికెటర్లు ఎక్కువగా అభద్రతాభావంతో ఉంటారని చెప్పిన ద్రవిడ్‌.. అందుకే అండర్‌–19, ఇండియా–ఏ ప్లేయర్లతో కలిసి పనిచేయడాన్ని ఇష్టపడుతానన్నాడు.