కరాచీ: సమకాలిన క్రికెట్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలా… సహచరుల్లో స్ఫూర్తిని నింపే ఆటగాళ్లు లేరని పాకిస్థాన్ మాజీ బ్యాట్స్మెన్ అమీర్ సోహైల్ ప్రశంసలు కురిపించాడు. ఈ విషయంలో తమ దిగ్గజ ఆటగాడు జావేద్ మియాందాద్తో పోలిక ఉందన్నాడు. ‘ప్రస్తుత తరంలో కోహ్లీ చాలా గొప్ప ఆటగాడు. అతని చుట్టూ ఉండే ప్లేయర్లలో చాలా స్ఫూర్తి నింపుతాడు. గొప్ప క్రికెటర్లలో ఉండే గొప్పదనం ఇదే. దిగ్గజాల సరసన చోటు సంపాదించాలంటే ఇలాంటి లక్షణాలు పుష్కలంగా ఉండాలి.
క్రికెట్లో పేరుమోసిన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. వ్యక్తిగతంగానూ గొప్ప ప్లేయర్లు చాలానే ఉన్నారు. కానీ వారి గొప్పతనం మాత్రం జట్టుకు ఉపయోగపడలేదు. పాక్ క్రికెట్ చరిత్రను తీసుకుంటే మియాందాద్ గొప్ప ఆటగాడు. తన చుట్టూ ఉండే ప్లేయర్ల స్థాయి పెరుగుపడడానికి చాలా కృషిచేశాడు. అతనితో కలిసి ఎక్కువ కాలం పని చేస్తే చాలా నేర్చుకోవచ్చు. మనం కూడా మెరుగవ్వాలనే స్ఫూర్తి కలుగుతుంది. కోహ్లీ కూడా ఇప్పుడు అదే పనిచేస్తున్నాడు. తనతో పాటు చుట్టు ఉండే సహచరులను కూడా మెరుగుపరుస్తాడు’ అని సోహైల్ పేర్కొన్నాడు.