Breaking News

కోహ్లీ.. కెప్టెన్​గా ఏదీ సాధించలేదు

న్యూఢిల్లీ: బ్యాట్స్​మెన్​గా ఎంతో ఎత్తుకు ఎదిగిన విరాట్ కోహ్లీ.. టీమిండియా కెప్టెన్​గా సాధించింది ఏమీ లేదని మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ విమర్శించాడు. కెరీర్​లో సారథిగా చాలా సాధించాల్సి ఉందన్నాడు. అతిముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో సత్తా చాటితేనే.. గొప్ప కెప్టెన్ల జాబితాలో చోటు దక్కుతుందన్నాడు. చూడటానికి టీమిండియా బలంగా కనిపిస్తున్నా.. అధిగమించాల్సిన బలహీనతలు కూడా ఉన్నాయన్నాడు. ‘జట్టులోని ఆటగాళ్ల బలాలు, బలహీనతలను గుర్తించి ప్రోత్సహించాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలే మెగా ఈవెంట్లలో రాణించడానికి దోహదం చేస్తాయి. కాబట్టి ఇప్పటివరకు కెప్టెన్​గా కోహ్లీ పెద్ద ఘనతలు సాధించలేదు. బ్యాటింగ్లో పరుగులు, రికార్డులు సాధిస్తున్నాడు. ఇది అతనికి మాత్రమే పరిమితం. వేరే వాళ్లతో పోల్చకూడదు. ఇతరుల్లోని ఆటను బయటకు తీసి ప్రోత్సహించినప్పుడు కెప్టెన్​గా విజయవంతమవుతాడు. అందరూ తనలా ఆడాలంటే కుదరదు. అందర్ని ఆడిస్తూనే, తాను రాణించి ప్రపంచకప్​ లాంటి మెగా టోర్నీలను గెలవాలి. అప్పుడే చరిత్రలో నిలబడిపోతాడు. ఇప్పటికైతే టీమ్​ను నంబర్​ వన్​గా నిలిపిన ఘనత ఒక్కటే అతని ఖాతాలో ఉంది’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.