సారథి న్యూస్, రంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడ గ్రామంలో నూతనంగా ఫ్రూట్ మార్కెట్ ను ఏర్పాటుచేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో కొత్తపేటలోని గడ్డి అన్నారం మార్కెట్ ను యుద్ధప్రతిపాదికన కోహెడకు తరలించారు.
ఇక్కడ జరుగుతున్న మార్కెట్ నిర్మాణ పనులను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంనర్సింహ గౌడ్ తో కలిసి మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడ్డిఅన్నారం మార్కెట్ సరిపోదని ముందస్తు ప్రణాళికతో కోహెడలో ఈ ఏడాది మామిడి మార్కెట్ సిద్ధం చేశామన్నారు. పండ్ల మార్కెట్ను మూడు రోజుల్లో అధికారికంగా ప్రారంభించి సంపూర్ణస్థాయి వినియోగంలోకి తీసుకొస్తామని తెలిపారు.
రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, అనధికారికంగా మామిడి రాక మొదలైందని చెప్పారు. మార్కెట్ కు రోజు 600 పండ్ల వాహనాలు వస్తున్నాయని, ఇది మరింత పెరుగుతుందని తెలిపారు. రెండు భారీ షెడ్లు సిద్దమైనప్పటికీ మరో షెడ్ నిర్మిస్తున్నామని, రూ.65 లక్షలతో 1.26 లక్షల చదరపు అడుగుల షెడ్లు అందుబాటులోకి వస్తాయని వివరించారు. తాగునీటి కోసం 22వేల లీటర్ల మంచినీటి ట్యాంకులు ఏర్పాటు చేశామన్నారు.
ఔటర్ నుంచి మార్కెట్ వరకు వెంటనే లైటింగ్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు, ఏజెంట్లు, సహాయకుల కోసం క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నామని, మార్కెట్ ఏజెంట్లు, సహాయకులకు పోలీసులతో ఇబ్బందులు తలెత్తకుండా గుర్తింపు కార్డులు వెంటనే జారీచేయాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల ఎకరాల్లో మామిడి సాగైందని, జగిత్యాల మామిడి ముంబైకి వెళ్తుందని, మిగిలిన మామిడి అంతా కోహెడ మార్కెట్ కు వస్తుందని తెలిపారు. మార్కెట్లో సీసీ కెమెరాలు, ప్రథమ చికిత్స కేంద్రం, అగ్నిమాపక కేంద్రం, పార్కింగ్ తదితర సౌకర్యాలన్నీ సిద్ధమయ్యాయని వివరించారు.
రైతులు, ఏజెంట్లు సామాజిక దూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లాస్థాయి అధికారులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.