కథ మాదేనంటూ వచ్చేస్తారు కొంతమంది. అదే స్టార్ హీరోల విషయమైతే మరింత రచ్చ చేయాలని చూస్తారు. రీసెంట్ గా చిరంజీవి సినిమా సైతం ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొవాల్సి వచ్చింది. చిరంజీవి, కొరటాల శివ కాంబోలో ‘ఆచార్య’మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా చిరు బర్త్ డే సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది మూవీ టీమ్. విడుదలైన కొద్దిసేపటికే కన్నెగంటి అనిల్ కృష్ణ అనే రచయిత.. ఆచార్య మోషన్ పోస్టర్ లో ‘ధర్మస్థలి’ అనే ఎపిసోడ్ తన స్క్రిప్ట్ నుంచి తీసుకున్నారని ఆరోపణ చేశాడు. తర్వాత మరో అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్ మండూరి కూడా తన స్టోరీ లైన్ తో కొరటాల సినిమా చేస్తున్నాడంటూ ఎలిగేషన్స్ చేశాడు.
అయితే ‘ఆచార్య’పై వస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలే అని చిత్ర నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ గురువారం అధికారికంగా ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది. ‘మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘ఆచార్య’ సినిమా ఒరిజినల్ కథ, కాన్సెప్ట్ దర్శకుడు కొరటాల శివకు మాత్రమే చెందుతుందని తెలియజేస్తున్నాం. అందరికీ తెలియజేసే విషయం ఒకటే.. ‘ఆచార్య’ కథ ఒరిజినల్ అని. కొరటాలపై ఇలాంటి ఆరోపణలు చేయడం తగదు. కొన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ‘ఆచార్య’ సినిమా గురించి తప్పుడు కథనాలు వేస్తున్నారు. ఈ కథ కోసం మెగాస్టార్‌తో కొరటాల శివ రెండేళ్ల పాటు ట్రావెల్ చేశారు. ఆయన ఇమేజ్‌కు తగినట్లు పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైనర్‌గా ‘ఆచార్య’సినిమా కథను సిద్ధం చేశారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ దశలోనే ఉంది. ఈ సినిమా విడుదల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం’ అని నోట్ ద్వారా మూవీ టీమ్ తెలియజేసింది.