Breaking News

కొత్త సెక్రటేరియట్ ​డిజైన్లు ఓకే

కొత్త సెక్రటేరియట్​డిజైన్లు ఒకే

  • తెలంగాణ పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగావకాశాలు
  • ఐటీ కంపెనీలకు అదనపు ప్రోత్సాహకాలు
  • సీఎం కేసీఆర్ ​అధ్యక్షతన కేబినెట్ ​భేటీలో కీలక నిర్ణయాలు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ కొత్త భవన సముదాయం నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిర్మాణ సంస్థలు ప్రతిపాదించిన డిజైన్లను ఆమోదించింది. దీంతోపాటు రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగావకాశాలు కల్పించే నూతన విధానానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం టీఎస్ ఐపాస్ చట్టం ద్వారా కొత్త పారిశ్రామిక అనుమతుల విధానం తెచ్చింది. దీనివల్ల పెద్దఎత్తున పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయి. అయితే ఇలా వస్తున్న పరిశ్రమల్లో తెలంగాణ యువకులకు ఎక్కువ అవకాశాలు దక్కేలా విధానం రూపొందించాలని ఇటీవలే సీఎం కేసీఆర్​ పరిశ్రమల శాఖను ఆదేశించారు. దీనిపై మంత్రి కె.తారక రామారావు ఆధ్వర్యంలో కసరత్తు చేసిన పరిశ్రమల శాఖ ముసాయిదా తయారుచేసింది. దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశం విస్తృతంగా చర్చించింది. తెలంగాణలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ అవకాశాలు రావాలని కేబినెట్ అభిప్రాయపడింది. స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. హైదరాబాద్ నగరంలో ఐటీ పరిశ్రమలు ఒకేచోట కాకుండా నగరం నలువైపులా విస్తరించాలని కేబినెట్ అభిప్రాయపడింది. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో తప్ప మిగతాచోట్ల ఐటీ కంపెనీలు పెట్టే వారికి అదనపు ప్రోత్సహకాలు అందించే హైదరాబాద్ గ్రిడ్ (గ్రోత్ ​ఇన్​డిప్రెషన్​) పాలసీని కేబినెట్ ఆమోదించింది.
ఎలక్ట్రిక్​ వాహనాల వాడకానికి ప్రోత్సాహం
పెరిగి పోతున్న వాహనాల వల్ల ఎక్కువయ్యే వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి రాష్ర్ట్రంలో ఎలక్ట్రానిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రత్యేక రాయితీలు ఇచ్చి రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమను ప్రోత్సహించాలని నిర్ణయించింది. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రానిక్ వెహికిల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ పాలసీని కేబినెట్ ఆమోదించింది.
కరోనా వ్యాప్తి.. నిరోధంపై విస్తృత చర్చ
కరోనా వ్యాప్తి.. వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స ప్రభుత్వ వైద్యాన్ని మరింత పటిష్టం చేసే అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం విస్తృతంగా చర్చించింది. దాదాపు రెండున్నర గంటల పాటు నిపుణులు, వైద్యులతో చర్చించింది. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, వివిధ విభాగాధిపతులను సమావేశానికి ఆహ్వానించి చర్చించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు కరోనా పరిస్థితిపై వివరాలు అందించారు. ‘ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు పాకిన కరోనా ప్రస్తుతం పెద్ద నరగాల్లో తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్ లోనూ కేసులు తగ్గుతున్నాయి. తెలంగాణలో మరణాలు రేటు తక్కువగానూ, కోలుకుంటున్న వారి రేటు ఎక్కువగానూ నమోదవుతోంది. కావునా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని వైద్య నిపుణులు కేబినెట్ కు వివరించారు. ఎన్ని కేసులు వచ్చినా వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించింది. ఎక్కువ వ్యయం చేసి ప్రైవేట్ ​ఆస్పత్రులకు పోవాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని వసతులు, మందులు, నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని, వారిని ఉపయోగించుకోవాలని కేబినెట్ ప్రజలను కోరింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావాల్సిన మందులు, పరికరాలు, వసతులు ఏర్పాటు చేయడానికి ఎన్ని డబ్బులైన వెనకాడేది లేదని స్పష్టం చేసింది.

– రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెమ్ డెసి విర్, లోమాలిక్యులర్ వెయిట్ హెపారిన్, డెక్సామిథజోన్ ఇంజక్షన్లు, ఫావిపిరావిర్ టాబ్లెట్లు, ఇతర మందులు, పీపీఈ కిట్లు, టెస్ట్ కిట్లు లక్షల సంఖ్యలో అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.
– పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లు తేలగానే వారికి వెంటనే హోం ఐసోలేషన్ కిట్స్ ఇవ్వాలని నిర్ణయించింది. 10 లక్షల హోం ఐసోలేషన్ కిట్స్ సిద్ధంగా ఉంచాలని నిర్ణయించింది.
– ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడైనా సిబ్బంది కొరత ఉంటే తాత్కాలిక పద్ధతిలో నియమించే అధికారం కలెక్టర్లకు ఇచ్చింది.
– రాష్ట్రవ్యాప్తంగా 10వేల ఆక్సిజన్ బెడ్లను సిద్ధంగా ఉంచాలని నిర్ణయించింది.
– కోవిడ్ రోగులకు చికిత్స అందించే విషయంలో అవకతవకలకు పాల్పడే ప్రైవేట్​ఆస్పత్రుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.
– ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన రూ.వంద కోట్లకు అదనంగా మరో రూ.వందకోట్లను విడుదల చేసింది. వైద్య ఆరోగ్య శాఖ నిధులను నెల వారీగా కచ్చితంగా విడుదల చేయాలి.
– ప్రైవేట్​మెడికల్ కాలేజీల్లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నందున వారికి కావాల్సిన మందులు, ఇంజక్షన్లు, భోజనాలు ఖర్చులు ప్రభుత్వం భరించాలని నిర్ణయించింది.
– ప్రతిరోజు 40వేల వరకు పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. మంత్రి ఈటల రాజెందర్, సిఎస్ సోమేశ్ కుమార్ గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, జిల్లాల్లో అవసరాలు తెలుసుకుంటారు. వెంటనే స్పందించి నిర్ణయం తీసుకుంటారు.