Breaking News

కృష్ణమ్మ.. జలసవ్వడి

కృష్ణమ్మ.. జలసవ్వడి

  • ఆల్మట్టి, నారాయణపూర్‌ నుంచి నీటి విడుదల
  • జూరాల నుంచి శ్రీశైలం వైపునకు కృష్ణానది పరవళ్లు

సారథి న్యూస్, కర్నూలు: కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్‌, ఉజ్జాయిని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో జూరాలకు వరద ఉరకలెత్తుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.759 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టు నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 317.560 మీటర్ల మేర నీళ్లు ఉన్నాయి. జూరాల ప్రాజెక్టుకు 2.56లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, 2,56,719 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం డ్యాంకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం రిజర్వాయర్​కు కృష్ణమ్మ పరవళ్లు
ఎగువ నుంచి నీటిఉధృతి పెరగడంతో జూరాల ప్రాజెక్టులో 39గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌ వే ద్వారా 2,57,152 క్యూసెక్కుల నీటిని వదులుతుండగా, పవర్‌ హౌస్‌ ద్వారా 23,593 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యాంకు చేరుతోంది. అలాగే సుంకేసుల నుంచి 4,311 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

ఉరకలేస్తున్న తుంగభద్ర
కర్ణాటకలో కురిసిన భారీవర్షాలకు తుంగభద్ర డ్యాం నిండుకుండలా మారింది. వరదనీరు శరవేగంగా టీబీ డ్యాంకు చేరుతుండడంతో తుంగభద్ర ప్రాజెక్టులో 12 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 35,880 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు నుంచి మొత్తం 38,284 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం డ్యాంకు విడుదల చేశారు.
మల్లన్న చెంతకు.. కృష్ణమ్మ
ఎగువ నుంచి వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో శరవేగంగా కృష్ణమ్మ శ్రీశైలం మల్లన్న చెంతకు చేరుతోంది. జూరాల నుంచి 2,56,719 క్యూసెక్కుల నీరు వస్తుండగా తుంగభద్ర నుంచి 35,880 క్యూసెక్కుల నీరు తరలివస్తోంది. టీబీ డ్యాం నీరు శ్రీశైలం చేరేందుకు వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. శ్రీశైలం డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 215.907 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 152.8314 టీఎంసీల మేర నీరు ఉంది. శ్రీశైలం డ్యాం ఎడమ విద్యుదుత్పత్తి కేంద్రం(ఆంధ్రప్రదేశ్) నుంచి ఎటువంటి విద్యుదుత్పత్తి చేయడం లేదు. శ్రీశైలం డ్యాం ఎడమ విద్యుదుత్పత్తి కేంద్రం(తెలంగాణ) నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ 40,259 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్​కు వదిలారు.