Breaking News

‘కూచాద్రి’ ఆలయాభివృద్ధికి కృషి

‘కూచాద్రి’ ఆలయాభివృద్ధికి కృషి

సారథి న్యూస్, మెదక్: హవేలి ఘనపూర్ మండలం కూచన్ పల్లిలోని పురాతన కూచాద్రి వెంకటేశ్వర స్వామి ఆలయానికి మహర్దశ కలగనుందని ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి చెప్పారు. మెదక్ పట్టణానికి సమీపంలో ఉన్న ఈ ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా, పర్యాటక ప్రదేశంగా అభివృద్ధిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. బుధవారం సీఎం కార్యాలయం ప్రత్యేక అధికారి భూపాల్ రెడ్డి, దేవాదాయ కమిషనర్ అనిల్ కుమార్, అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ శోభారాణి, ఇన్​చార్జ్​జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డితో కలిసి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవుడి మాన్యాలు చాలా ఉన్నాయని, గుట్ట ప్రాంతానికి ఫెన్సింగ్ చేసి గార్డెనింగ్ తో అందంగా తీర్చిదిద్ది పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఉన్నతాధికారులకు ఆలయ చరిత్రను వివరించారు. శోభారాణి మాట్లాడుతూ.. అందమైన పార్కుగా తీర్చిదిద్దేందుకు మొక్కల పెంపకానికి అవసరమైన సాంకేతిక సలహాలు, సూచనలు ఇవ్వాలని ఇన్​చార్జ్​అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్ కు సూచించారు. అంతకుముందు ఆలయ కార్యనిర్వహణాధికారి సార శ్రీనివాస్, చైర్మన్ గోపాల్ పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికి శాలువా కప్పి సన్మానించి, తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శరవణన్, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ పాల్గొన్నారు.