- దండకారణ్యంలో విస్తృతంగా తనిఖీలు
- భారీ సంఖ్యలో పోలీసు బలగాల మోహరింపు
సారథి న్యూస్, వాజేడు: కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న దండకారణ్యంలో మళ్లీ అలజడి మొదలైంది. మావోయిస్టులు తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నారన్న ఇంటలిజెన్స్సమాచారం మేరకు పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికుల్లో కలవరం నెలకొంది. ములుగు జిల్లా, చత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో కొద్దిరోజులుగా పెద్దసంఖ్యలో పోలీసు బలగాలు కుంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సీఐ శివప్రసాద్ నేతృత్వంలో సివిల్ పోలీసులు, సీఆర్పీఎఫ్ బృందాలు నేషనల్ హైవే నం.163పై తనిఖీలు నిర్వహించాయి. అంతర్రాష్ట్ర సరిహద్దు టేకులగూడెం వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చి పోయే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి అనుమానితుల వద్ద ఆధార్‌కార్డు, వాహనాల రిజిస్ట్రేషన్పేపర్లు, డ్రైవింగ్లైసెన్స్ ను పరిశీలించి పంపిస్తున్నారు. ఈ తనిఖీల్లో పేరూరు ఎస్సై బండి హరికృష్ణ, వాజేడు ఎస్సై తిరుపతి రావు, సివిల్, సీఆర్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.