Breaking News

కుండపోత వాన

కుండపోత వాన
  • రోజంతా విడవని వాన
  • ఏకమైన వాగులు, వంకలు
  • పలు పట్టణాల్లో లోతట్టుకాలనీలు జలమయం

సారథి న్యూస్, మెదక్, నారాయణఖేడ్, భద్రాద్రి కొత్తగూడెం: వానాకాలం మొదలయ్యాక తొలిసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాన దంచికొట్టింది. బుధవారం దాదాపు అన్ని జిల్లాల్లో భారీవర్షం కురిసింది. మహబూబ్​నగర్​, వికారాబాద్​, జోగుళాంబ గద్వాల, హైదరాబాద్​, వరంగల్​, ఖమ్మం జిల్లాలో వాన దంచికొట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో కుండపోత వానపడింది. చిలప్‌చేడ్‌ మండలంలో అత్యధికంగా 9.3సెం.మీ., కొల్చారం మండలంలో 8.9సెం.మీ., హవేలీ ఘనపూర్ మండలం వాడిలో 7.3సెం.మీ., కౌడిపల్లిలో 7.2సెం.మీ., నర్సాపూర్ మండలంలో 7.1 సెం.మీ.అత్యధిక వర్షపాతం నమోదైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు గంటల తరబడి భారీవర్షం పడడంతో కుంటలు, చెరువుల్లోని భారీగా వరదనీరు వచ్చిచేరింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలు పడటంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

భారీవర్షం.. అపారనష్టం
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీవర్షం కురిసింది. కుంటలు, చెరువులు, పొంగిపారాయి. భారీ వర్షానికి కంగ్టి మండలంలోని కర్ణాటక బోర్డర్ గ్రామమైన దెగుల్ వాడీలో నిర్మిస్తున్న వైకుంఠ ధామానికి కావాల్సిన 55టన్నుల ఇసుక,30బస్తాలు సిమెంట్ ఇనుప రేకులు, ఇతర మెటీరియల్స్ వరద నీటిలో కొట్టుకుపోయింది. రూ.2.5 లక్షల నష్టం వాటిల్లిందని సర్పంచ్ చంద్రవ్వ తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా బుధవారం ఎడతెరిపి లేకుండా భారీవర్షం కురిసింది. లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. పాల్వంచ మండల కేంద్రంలో కాలనీల్లో నీళ్లు చేరాయి. రోడ్లపైకి భారీగా చేరిన వరద నీరు చేరింది. పాల్వంచ పెద్దమ్మతల్లి వైన్స్ ఎదురుగా ఉన్న మోరీలోపడి గుగులోత్ ధర్మయ్య అనే వ్యక్తి చనిపోయాడు. మృతుడు కేటీపీఎస్​లో ఆర్టిజన్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు.