* బీఎస్ 6 వెహికిల్ తో పర్యావరణ పరిరక్షణ
* ఏప్రిల్ 1నుంచి సరికొత్త ప్రమాణాలతో వాహనాలు
సారథి న్యూస్, హైదరాబాద్: దేశంలో జానాభాతో పాటు వాహనాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఏటా లక్షల కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. వాటి నుంచి వెలువడే కర్బన ఉద్గారాలతో కాలుష్యం కోరలు చాస్తోంది. వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలను నియంత్రించాలన్న లక్ష్యంతో దేశంలో తొలిసారిగా 1991లో పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాల విడుదలపై పరిమితులు విధించారు. అప్పటి నుంచే సీసం లేని పెట్రోల్‌విక్రయంతోపాటు వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించేందుకు అవసరమైన ‘క్యాటలిటిక్ కన్వర్టర్ల’ను వాహనాల్లో వినియోగించడం మొదలైంది. వాహనాల నుంచి వెలువడే కాలుష్యంపై నియంత్రణకు 2002లో భారత ప్రభుత్వం నియమించిన మషేల్కర్‌కమిటీ ఓ నివేదికను రూపొందించింది. ప్రపంచంలో అప్పటికే వాహన కాలుష్యంపై పలురకాల నిబంధనలను పొందుపరచి సమర్థంగా అమలు చేస్తున్న యూరోపియన్ యూనియన్ కర్బన ఉద్గారాల నియంత్రణ ప్రమాణాలను నమూనాగా తీసుకుంది. మషేల్కర్‌కమిటీ నివేదికను ప్రామాణికంగా తీసుకున్న కేంద్రం, 2003లో జాతీయ వాహన ఇంధన విధానాన్ని ప్రకటించింది. యూరో ప్రమాణాలకు అనుగుణంగా దీనికి ‘భారత్ స్టేజ్’ అని పేరు పెట్టారు. కర్బన ఉద్గారాల నియంత్రణలో వస్తున్న మార్పులకు అనుగుణంగా దీన్ని దశలవారీగా ఉన్నతీకరిస్తున్నారు. 2003లో యూరో-2 నియమాలకు అనుగుణంగా భారత్ స్టేజ్‌ను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఆధునికీకరించిన యూరో ప్రమాణాల ప్రకారం మారుస్తున్నారు. ప్రస్తుతం ఏప్రిల్ ఒకటి నుంచి భారత్ స్టేజ్6 అమలుకానుంది. భారత్ స్టేజ్ అనేది- వాహన ఇంజిన్ల ప్రమాణాలను నిర్దేశించి, కర్బన ఉద్గారాలను నియంత్రించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతోంది.
ప్రయోజనాలు ఇవే..
దేశవ్యాప్తంగా ఏప్రిల్ ఒకటి నుంచి బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా ఇంధనం లభ్యం కానుంది. బీమా, పన్నులు పెరగడమూ వాహన విక్రయాలకు అటంకమే. జీఎస్‌టీని తగ్గిస్తే వాహన విక్రయాలు పెరగవచ్చు. దీంతో పరిశ్రమ నష్టాల నుంచి బయటపడే అవకాశముంది. 2030కల్లా భారత్10లక్షల కోట్ల డాలర్ల ఆర్థికవ్యవస్థగా మారాలని నీతి ఆయోగ్‌ఆశిస్తోంది. వాహన పరిశ్రమలో ముఖ్యంగా 150 సీసీ కంటే తక్కువ ఉండే బైక్‌లు 2025కు, ఆటోలు 2023కు కరెంట్‌తో నడిచేలా తీసుకురావాలని సూచించింది. విద్యుత్ వాహనాలు రానున్న నేపథ్యంలో బీఎస్6 అంశంపై చర్చలు ప్రారంభమయ్యాయి. దేశంలో విద్యుత్‌వాహనాలు ఇప్పటికే విపణిలోకి వచ్చాయి. వీటి ధర సాధారణ వాహనాలతో పోలిస్తే ఎక్కువగా ఉండటంతో పాటు ఛార్జింగ్ సదుపాయాలు అందుబాటులో లేకపోవడంవల్ల వీటి అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రత్యేకించి దూరప్రాంతాలకు ప్రయాణించేవారికి ‘బ్యాటరీ బ్యాకప్’ లేకపోవడంతో విద్యుత్‌వాహనాలు నగరాలకే పరిమితమయ్యాయి. ఈ వాహనాల్లో లిథియం ఇయాన్ బ్యాటరీలను వినియోగిస్తున్నారు. బీఎస్6తో ఇంధనంలో కాలుష్య కారకాలైన సీసం, గంధకం, కార్బన్‌మోనాక్సైడ్, నత్రజని తదితర వాయువుల విడుదలా తగ్గనుంది. ఇక వెహికిల్స్ జీవిత కాలాన్ని 15 ఏళ్లకు పరిమితం చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. 15 ఏళ్ల కాలపరిమితి ముగిసిన వాహనాలను తుక్కు కింద మార్చేస్తారు. ఈ నిర్ణయం వెలువడితే కొత్త వాహనాల విక్రయాలు తిరిగి పుంజుకోవచ్చు.