భై అంటే భయం అని, రవ అంటే ప్రతిధ్వని అని అర్థం. ఈ రెండు పదాలు భైరవుడి స్వభావాన్ని తెలియజేస్తాయి. కాలభైరవ సాధనలో ప్రత్యేక విషయమేమంటే సాధకుడికి భవిష్యత్‌లో జరగబోయే ప్రమాదాలు, చెడు పరిణామాలు, రకరకాల సమస్యల గురించి ముందుగానే తెలియజేస్తాడు. కాలభైరవుడు ఆ సాధకుడికి సాధన కాలంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వెంటే ఉండి కాపాడుతుంటాడని తంత్రశాస్త్ర విజ్ఞానం తెలియజేస్తుంది. సాధారణంగా భైరవుడు, శక్తి ఆలయాలకు కాపలాదారుడిగా వ్యవహరిస్తాడు.
ఈ భైరవుడు ఎలా అవతరించాడంటే శివ మహాపురాణంలో వివరించారు. ‘సృష్టి కర్త ఎవరు?’ అన్న విషయంపై బ్రహ్మవిష్ణుల మధ్య తీవ్రస్థాయిలో వివాదం మొదలైంది. ‘నేనే నీ కంటే గొప్పవాడిని కావునా నీవు నన్ను ఆరాధించాలి’ అని బ్రహ్మ.. విష్ణువుతో అన్నాడు. విష్ణువు కూడా అలాగే అన్నాడు. ఇలా బ్రహ్మ, విష్ణువుల మధ్య జరిగిన వివాదాన్ని చూసిన మహాదేవుడు ఎంతో ఆగ్రహంతో ‘అసలు సృష్టికర్తను నేనే ఉండగా, సృష్టికర్తను నేనేనని అహంకారంతో పలికావు’ అని ఆ మహాదేవుడు బ్రహ్మను నిందించాడు. ఆ సమయంలో మహాదేవుడు ఎంతో క్రోధస్వరూపుడై భైరవ అవతారం ధరించి బ్రహ్మదేవుడి ఐదు శిరస్సుల్లో ఒక దానిని ఖండించారు. ఇక అప్పటి నుంచి బ్రహ్మను చతుర్ముఖుడని పిలవడం ప్రారంభించాడు. అలా బ్రహ్మదేవుడి శిరస్సును ఖండించడం ద్వారా మహాదేవుడికి బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంది. అంతేకాకుండా ఖండించిన శిరస్సు పరమశివుడి చేతికి అంటుకుపోయింది. అలా భైరవుడు ఎక్కడికి వెళ్లినా బ్రహ్మ హత్యాదోషం ఆయనను వెంటాడుతోంది. బ్రహ్మహత్యాపాతకం నుంచి బయటకు రావడానికి భైరవుడు కాశీ పట్టణానికి ప్రవేశించాడు. ఎంతో అతి పవిత్రమైన ఆ కాశీ నగరంలోకి బ్రహ్మహత్యాదోషంతో ప్రవేశించలేక ఆ నగర పొలిమేరల్లో ఉండిపోయాడు. ఆ తర్వాత కాశీ నగరాన్ని పరిపాలిస్తున్న విశ్వనాథుడు(ఆయన శివుడి ఒక రూపం) భైరవుడిని కాశీనగర రక్షణార్థంగా నియమించారు. ఇక ఆనాటి నుంచి భైరవుడిని కాలభైరవుడు అని పిలుస్తున్నారు. ఇక కాలభైరవుడికి శునకం వాహనంగా ఉంటుంది. ఇప్పటికీ కాశీకి వెళ్లిన భక్తులు అక్కడ ఉన్న భైరవ ఆలయానికి వెళ్లి కాలభైరవుడిని ముందుగా దర్శించుకున్న తర్వాతే విశ్వేశ్వరస్వామి దర్శనం చేసుకుంటారు. కాలభైరవుడి దర్శనం చేస్తే కానీ భక్తులకు కాశీదర్శనం చేసిన పుణ్యఫలం లభించదని విశ్వాసం.
కాలభైరవుడి రూపాలు
- కాలభైరవుడు
- అశితంగ భైరవుడు
- సంహార భైరవుడు
- రురుభైరవుడు
- క్రోధ భైరవుడు
- కపాలభైరవుడు
- రుద్రభైరవుడు
- ఉన్మత్త భైరవుడు
ఇదీ భైరవుడి రూపం
భైరవుడు ఆగ్రహం నిండిన కళ్లు, పదునైన పులిదంతాలు, జ్వాలను కక్కుతున్న శిరోజాలతో నగ్నంగా కనిపిస్తాడు. ఆయన మెడలో ఉండే కపాలమాల, సర్పం మినహా ఆయన ఒంటిపై ఎలాంటి దుస్తులు ఉండవు. ఆయన హస్తాలలో త్రిశూలం, ఢమరుకం, కపాలం కనిపిస్తుంది. కాలభైరవుడు నల్లటి శరీరఛాయను కలిగి, ఉగ్ర చూపులతో కనిపిస్తాడని ఒక శునకం ఆయనకు వాహనంగా ఉంటుందని సిద్ధులు తెలియజేశారు. మానవుడు ఈ భైరవుడిని ఆరాధిస్తే వారికి చెడుకాలం పోయి మంచికాలం వస్తుందని చాలామంది సిద్ధ పురుషులు ఘంటాపథంగా చెబుతుంటారు. భైరవుడు ప్రతి మనిషి కాలాన్ని నియంత్రిస్తూ ఉంటాడు. ఎలాంటి సంపాన లేక నిరుపేదగా ఉండే వ్యక్తి ఈ కాలభైరవుడిని ఆరాధించడం ద్వారా అదృష్టాన్ని పొంది గొప్పస్థితిలో ఉంటాడు. కొంతమందికి చేయాలని ఉన్నా కూడా పని దొరకదు. అలాంటి వారు కాలభైరవ ఆరాధన ద్వారా నిరుద్యోగ సమస్య నుంచి బయటపడతారు. ప్రతినెలా కృష్ణపక్షంలో(పౌర్ణమి తర్వాత) వచ్చే 8వ రోజు అంటే అష్టమి కాలబైరవుడికి పూజలు చేయడం చాలా మంచిదని ప్రతీతి. కాలభైరవుడు అష్టమి రోజున జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. కాలభైరవ జయంతి రోజున ఉపవాసం ఉండి ఆయనను ప్రార్థిస్తే అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి. సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ కాలభైరవ అష్టమి రోజున కుక్కలకు ఆహారంగా పెరుగు, పాలు, చేపలు, తీపి పదార్థాలు తినిపించడం ద్వారా అనేక దారిద్ర్యాలు తొలగిపోతాయి.
కాలం అంతుచిక్కనిది
కాలం కేవలం మనుషులనే కాకుండా ప్రాంతాలు, పర్వతాలు, సముద్రాలు చివరికి అంతరిక్షంలో సంచరించే గ్రహాలను సైతం శాసిస్తుంది. కాలం అంతుచిక్కనిది. కాలానికి పెరుగుదలతో సంబంధం ఉంటుంది. ఒక బిడ్డ జన్మించినప్పుడు చిన్నదిగా ఉండి కాలం గడిచేకొద్దీ పెద్దదిగా అయి ఒక స్త్రీ లేక పురుషుడిగా పరిణామం చెందుతుంది. చెట్లు, జంతువులు పుడతాయి, పెరుగుతాయి, అసలు కాలం ఏమిటి!? కాలాన్ని ఇదమిత్థంగా నిర్వచించడం సాధ్యపడనప్పటికీ కాలం అంటే చలనం అని భావించవచ్చు. గ్రహాల కదలిక ఆధారంగా కాలాన్ని నిర్ణయిస్తున్నాం. సూర్యుడి చుట్టూ భూమి ఒక సారి చుట్టి రావడానికి పట్టు కాలాన్ని సంవత్సరం అని, భూమి చుట్టూ చంద్రుడు ఒక సారి ప్రదక్షిణ చేసి రావడానికి పట్టే కాలాన్ని నెల అంటున్నారు. గ్రహాలు కదలకపోతే కాలం ఉండదు. ప్రాచీన తమిళ దేశానికి చెందిన సిద్ధులు కాలాన్ని చాలా లోతుగా అధ్యయనం చేశారు. సిద్ధుల సిద్ధాంతం ప్రకారం చూస్తే ఈ ప్రపంచం యావత్తూ కాలభైరవుడి ఆధీనంలో ఉంటుంది. ఆయన కాలాన్ని నిర్ణయిస్తారు. అనేక గ్రహాలు కలిసి ఒక గ్రహకుటుంబం ఏర్పడుతుంది. ఇలాంటి ఎన్నో గ్రహకుటుంబాలు కలిసి అనంతవిశ్వం ఏర్పడుతుంది. ఒక్కో గ్రహం మీద ఒక్కో విధమైన కాలం ఉంటుంది. భూమ్మీద కాలం నిధానంగా కదులుతుంది.
కాలభైరవుడిని ఎప్పుడు ఆరాధించాలి
ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే కృష్ణపక్ష అష్టమి రోజున కాలభైరవ జయంతి జరుగుతుంది. ఆ రోజున చేసే ఎలాంటి తాంత్రిక పూజలైన అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. పితృదోషం, పుత్ర దోషాలు, స్ర్తీదోషం వంటి దోషాలతో ఇబ్బందిపడేవారు ఆ రోజున కాలభైరవుడిని ఆరాధించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.
:: దిండిగల్ ఆనంద్‌శర్మ
సీనియర్ జర్నలిస్టు,
ముఖ్యఅర్చకులు, జోగుళాంబ ఆలయం