Breaking News

కాటన్ టవల్​తో రుద్దండి


న్యూఢిల్లీ: బంతి రంగు మెరుగుపర్చేందుకు పాత కాలంలో వాడినట్లుగా.. కాటన్ టవల్​తో రుద్దితే సరిపోతుందని బ్రిటిష్ క్రికెట్ బాల్స్ లిమిటెడ్ (డ్యూక్స్) వెల్లడించింది. క్రికెట్ ఆరంభంలో చాలా మంది దిగ్గజ బౌలర్లు ఇదే సూత్రాన్ని పాటించారని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ జజోడియా తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్మి వాడకపోవడం మంచిదేనని, అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘టెస్ట్ మ్యాచ్​ల్లో బంతి పాతబడే కొద్ది మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది.

దీనికి ఉమ్మి, చెమట ఏదైనా ఉపయోగించవచ్చు. అయితే మేం బంతి సీమ్​ను చేతితో కుడతాం. కాబట్టి నైపుణ్యం ఉన్న బౌలర్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్వింగ్ చేస్తాడు. బంతిని జెర్సీకి రుద్దినా మైనంలాగా పని చేస్తుంది. మాల్కమ్ మార్షల్ నడుంకు ఎప్పుడు ఓ టవల్ ఉండేది. దానితోనే బంతిని రబ్ చేసేవాడు. ఇప్పుడు బౌలర్లు అదే సూత్రాన్ని పాటించాలి’ అని జజోడియా పేర్కొన్నారు. ప్రత్యామ్నాయాల బదులుగా కాటన్ బట్టపై రుద్దితే బంతి అనుకున్న మేరకు రంగు మెరుగవుతుందన్నారు. కాబట్టి ఇప్పుడు జరగబోయే మ్యాచ్​ల్లో కాటన్ టవల్​ను క్యారీ చేయాలని సూచించారు.