న్యూఢిల్లీ : భారత్ లో కరోనా మహమ్మారి మహోగ్రరూపం దాలుస్తోంది. కొద్దిరోజులుగా దేశంలో 80వేలకు పైగా మంది కోవిడ్ బారినపడ్డారు. మరీ ముఖ్యంగా గత రెండు వారాల్లో అయితే వైరస్ విజృంభణ ఉప్పెనలా కొనసాగుతోంది. గతనెల 30 నుంచి ఈ నెల మొదటి వరకు దేశంలో సుమారు ఆరు లక్షల కరోనా కేసులు నమోదయింటే దీని ఉధృతిని ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక శనివారం, ఆదివారం అయితే దేశంలో కరోనా కేసులు 90 వేలు దాటాయి. ఆదివారం ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఏకంగా 40 శాతం కేసులు భారత్ నుంచే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. పట్టణాలు, ద్వితీయస్థాయి నగరాలే కాకుండా పల్లెల్లోకి వైరస్ పాకడంతో దేశవ్యాప్తంగా మహమ్మారి విజృంభిస్తోంది. ఇక కరోనా కేసుల్లో ఇప్పటికే ప్రపంచంలో రెండవ స్థానానికి చేరిన భారత్.. కేసుల పరంపర ఇలాగే కొనసాగితే మొదటిస్థానంలో ఉన్న అమెరికా (64 లక్షల కేసులు) ను మరో పది, పదిహేను రోజుల్లోనే దాటేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
40 శాతం మన దగ్గరే..
పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా విజృంభిస్తున్న కరోనా.. భారత్ లో తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఆదివారం ప్రపంచవ్యాప్తంగా 2,31,659 కేసులు నమోదైతే.. అందులో 94,107 కేసులు (40.6 శాతం) ఇండియాలో ఉండడం గమనార్హం. ఇదే రోజు యూఎస్ లో ౩1,110 కేసులు రాగా.. బ్రెజిల్ లో 14,606 మాత్రమే నమోదయ్యాయి. ఇక శనివారం, ఆదివారం భారత్ లో నమోదైన కేసులు.. పై రెండు దేశాల కంటే ఎక్కువ. ఈ రెండ్రోజుల్లోనే దేశంలో 1.84లక్షల పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇదిలాఉండగా దేశంలో సోమవారం 74,960 మంది వ్యాధి బారినపడగా, మంగళవారం 75,809 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
గడిచిన రెండు వారాల్లో..
భారత్లో గడిచిన వారాల్లోనే దాదాపు 6 లక్షల మందికి ఈ వైరస్ సోకినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆగస్టు ౩౦-సెప్టెంబర్ 6 మధ్య ఈ కేసులు నమోదవగా.. ఇవి అంతకు ముందు వారంతో పోలిస్తే 13 శాతం అధికం. అయితే ఆగస్టు 24-30 న మధ్య నమోదైన కేసులు అంతక్రితం వారంతో పోలిస్తే 13 శాతం ఎక్కువే. దీన్ని బట్టి చూస్తే.. గడిచిన రెండు వారాల్లోనే.. దేశంలో కోవిడ్ కేసులు 26 శాతం పెరిగాయి.
మరణాలూ పెరుగుతున్నాయి
కరోనా విజృంభిస్తున్నప్పటికీ.. అది సోకినా వారంతా కోలుకుంటున్నారని, రికవరీ రేటు అధికంగా ఉందని కేంద్ర, రాష్త్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ వైరస్ సోకి మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. కొద్దిరోజులుగా దేశంలో సుమారు వేయి, ఆ పైనే మరణాలు నమోదవుతున్నాయి. నాలుగు రోజులుగా చూసుకుంటే.. 1,089, 1,065, 1,016, 1,133 మంది చనిపోతున్నారు. మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 72,775 కి చేరడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఆ 5 రాష్ట్రాల్లోనే ఎక్కువ
దేశవ్యాప్తంగా కరోనా కబళిస్తున్నప్పటికీ 5 రాష్ట్రాల్లో మాత్రం అది ఉగ్రరూపం దాల్చుతోంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో 60 శాతానికి పైగా ఈ రాష్ట్రాల నుంచే రావడం గమనార్హం. భారత్ లో కరోనా విలయతాండవం చేస్తున్నా.. నానాటికీ కేసులు, మరణాలూ పెరుగుతున్నా ప్రభుత్వాలకు మాత్రం చీమ కుట్టినట్లయినా లేదు. పైగా, తమ ప్రభుత్వ అధినేతలు చేపడుతున్న చర్యల వల్లే కరోనా అదుపులో ఉందని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. ఇటీవలే బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ.. ‘దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం వల్ల ప్రధాని మోడీ 130 కోట్ల మంది ప్రాణాలు కాపాడారు. ఆయన ప్రయత్నాలను ప్రపంచాధినేతలు కొనియాడారు’ అని వ్యాఖ్యానించారు. కానీ వాస్తవాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వాల గొప్పలు సరేసరి.
- September 8, 2020
- Archive
- Top News
- జాతీయం
- CARONA
- COVID19
- HEALTHMINISTRY
- INDIA BULLETIN
- ఇండియా రిపోర్టు
- కరోనా
- కోవిడ్19
- పాజిటివ్కేసులు
- లాక్డౌన్
- Comments Off on కరోనా మహమ్మారి మహోగ్రరూపం