సారథి న్యూస్, హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను జయించడంలో ఓ అడుగు ముందుకుపడినట్టే.. ప్రపంచమంతా ఎదురుచూస్తున్న వ్యాక్సిన్అందుబాటులోకి రానుంది. రష్యా ముందుగా ప్రకటించిన విధంగానే ఆగస్టు 12న కరోనా టీకా విడుదలచేస్తున్నట్టు ప్రకటించింది. గ్వామ్ కోవిడ్ వ్యాక్ లయో పేరుతో తయారుచేసిన టీకాను విడుదల చేస్తున్నట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ కూడా ప్రకటించింది. దేశంలో అందరికీ ఈ టీకా ఇచ్చేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయని, ఈ వారంలోనే అది పూర్తవుతుందని పేర్కొంది.
రష్యాలోని గమలేయా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, ఆ దేశ రక్షణశాఖ ఈ టీకాను తయారుచేశాయి. టీకా అందుబాటులోకి వచ్చిన తర్వాత ముందుగా వైద్యసిబ్బంది, టీచర్లకు టీకా ఇస్తామని, నవంబర్ నాటికి అందరికీ టీకా అందుతుందని వెల్లడించింది. అయితే అమెరికాకు చెందిన కరోనా టాస్క్‌ఫోర్స్ సభ్యుడు డాక్టర్ ఆంథొనీ ఫాసీ.. ‘చైనా, రష్యా అందరికీ వ్యాక్సిన్ అందించే ముందు తగిన పరీక్షలు నిర్వహించాయనే ఆశిస్తున్నా’ అని అన్నారు.