Breaking News

కరోనాకు పతంజలి మందు


హరిద్వార్‌‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కంటికి కనిపించని మహమ్మారికి చెక్‌ పెట్టేందుకు ఆయుర్వేద మందు వచ్చేసింది. ప్రముఖ దేశీయ కంపెనీ పతంజలి దీన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ‘కొరోనిల్‌’ పేరుతో ఈ మందును ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా మంగళవారం హరిద్వారలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు. మెడిసిన్‌ను డెవలప్‌ చేసేందుకు సైంటిస్టుల టీమ్‌ పనిచేస్తోందని సీఈవో ఆచార్య బాలకృష్ణ గతంలోనే ప్రకటించారు. పతంజలి రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (పీఆర్‌‌ఐ), నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌ జైపూర్​తో కలిసి దివ్య ఫార్మసీ ఆఫ్‌ ది పతంజలి దీన్ని రూపొందించినట్లు ఆయన వెల్లడించారు.

కొరోనిల్‌ ద్వారా 14 రోజుల్లోనే కరోనాను నయం చేయవచ్చన్నారు. ‘కరోనా కోసం మందు కనిపెట్టాలని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఇవాళ మేం ప్రూవ్‌ చేశాం. మొదటి ఆయుర్వేదిక్‌ మెడిసిన్‌ను తయారు చేశాం. 100 మందిపైన క్లినికల్‌ ట్రయల్స్‌ చేశాం. మూడు రోజుల్లో దాదాపు 65 శాతం మంది కోలుకున్నారు’ అని రామ్‌దేవ్‌ బాబా అన్నారు. ఏడు రోజుల్లో వందశాతం పేషంట్లకు జబ్బు తగ్గిపోయిందని, సమగ్రమైన రిసెర్చ్‌ చేసి ఈ మందును కనుగొన్నామన్నారు. ఈ మెడిసిన్‌కు వంద పర్సెంట్‌ రికవరీ రేట్‌ ఉందని, జీరో శాతం డెత్‌ రేట్‌ ఉందన్నారు. మెడిసిన్‌ తయారీలో అన్ని సైంటిఫిక్‌ రూల్స్‌ను పాటించామని చెప్పారు.