Breaking News

కమిషనర్ ​చొరవ.. ఖాళీస్థలాలు క్లీన్​ అండ్ ​గ్రీన్​

కమిషనర్​చొరవ.. ఖాళీస్థలాలు క్లీన్​అండ్​గ్రీన్​

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలోని చాలా ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా యజమానుల పర్యవేక్షణ లేక చెత్తదిబ్బలుగా, మురుగు కుంటలుగా మారిన ఖాళీస్థలాల రూపురేఖలు మారిపోతున్నాయి. మున్సిపల్​కార్పొరేషన్​కమిషనర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో శానిటరీ ఇన్​స్పెక్టర్లు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. స్థానిక బుధవారంపేటలోని హాబీబ్ ముబారక్ నగర్ లో ఓ ఖాళీ స్థలం ఇళ్ల మధ్యలో ఉండి చాలా ఏళ్లుగా చెత్తదిబ్బగా మారి ఇరుగుపొరుగు వారికి దుర్గంధం రావడంతో పాటు దోమలు, పందుల బెడదతో సతమతమవుతుండేవారు. ఈ విషయాన్ని గుర్తించిన సంబంధిత శానిటరీ ఇన్​స్పెక్టర్ ​అనిల్, వార్డు శానిటరీ కార్యదర్శులు ఇలియాజ్, మద్దిలేటి, మహమ్మద్ హుస్సేన్ కమిషనర్ డీకే బాలాజీ సూచనలతో సదరు ఖాళీస్థలం సంరక్షణకు సంబంధిత యజమాని ముందుకు రావాలని, లేనిపక్షంలో జరిమానాలు విధిస్తామని హెచ్చరిక బోర్డును ఏర్పాటుచేశారు. విషయం తెలుసుకున్న ఆ యజమాని వెంటనే స్పందించాడు. మంగళవారం జేసీబీ వాహనంతో తన స్థలంలో ఉన్న చెత్త, ఇతర వ్యర్థాలను తొలగించి భూమిని చదును చేశాడు. తన స్థలం చుట్టూ ప్రహరీ కట్టుకుంటానని చెప్పాడు.
ప్రజలు భాగస్వాములు కావాలి
స్వచ్ఛ కర్నూలు సంకల్పాన్ని సాకారం చేసేందుకు నగరంలోని ఖాళీస్థలాల సంరక్షణకు ముందుకొస్తున్న ప్రతి ఒక్క యజమానికి కమిషనర్ బాలాజీ అభినందనలు తెలిపారు. మొదటసారి కృష్ణానగర్ లో ఓ యజమాని తన ఖాళీస్థలం చుట్టూ ప్రహరీ నిర్మించుకున్నాడని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే నగరాన్ని చెత్తరహిత కర్నూలు సిటీగా మార్చుతామని వివరించారు.