Breaking News

కదలినయ్​.. ప్రగతిరథ చక్రాలు​

కదలినయ్​.. ప్రగతిరథ చక్రాలు​
మెదక్​ నుంచి బస్సులో వెళ్తున్న ప్రయాణికులు
చేవెళ్ల బస్టాండ్​ నుంచి వెళ్తున్న బస్సు

సారథి న్యూస్​, మెదక్, చేవెళ్ల​: కరోనా(కోవిడ్ –19) వ్యాప్తి నేపథ్యంలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు.. బయటికి కదిలాయి. ప్రభుత్వం కంటైన్​ మెంట్ ఏరియాలు మినహా అన్ని ప్రాంతాలను గ్రీన్ జోన్ లుగా ప్రకటించడంతో ప్రజారవాణా మొదలైంది. కరోనా వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ విధించడంతో మార్చి 22 నుంచి ఆర్టీసీ బస్సుల రాకపోకలను నిలిచిపోయిన విషయం తెలిసిందే. కాగా కేంద్ర ప్రభుత్వం సడలింపు ఇచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు మంగళవారం నుంచి బస్సుల రాకపోకలు షురూ అయ్యాయి. మెదక్ డిపోలో మొత్తం 101 బస్సులు ఉండగా, తొలిరోజు 40 బస్సులు నడిచాయి, హైదరాబాద్, సికింద్రాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, పఠాన్ చెరు, చేగుంట, బొద్మట్ పల్లి రూట్లలో నడిచాయి. క్రమంగా అన్ని రూట్లలో బస్ లు నడుపుతామని మెదక్ డిపో మేనేజర్ జాకీర్ హుస్సేన్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50 శాతం మంది ప్రయాణికులను మాత్రమే ఎక్కించుకుంటున్నారు. భౌతిక దూరం పాటించేలా చూడడంతో పాటు శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. కండక్టర్, డ్రైవర్ తో పాటు ప్రయాణికులు అందరూ విధిగా మాస్క్ కట్టుకునేలా చూస్తున్నారు.

పరిమిత ప్రాంతాల్లో బస్సులను ప్రారంభించినట్లు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల డిపో మేనేజర్​ గణేష్​ చెప్పారు. చేవెళ్ల నుంచి హైదరాబాద్ శివారు ప్రాంతమైన అప్ప జంక్షన్ వరకు మాత్రమే బస్సులు రాకపోకలు సాగించాయి. శంకర్​పల్లి, షాద్​నగర్​, వికారాబాద్ పరిసర గ్రామాలకు బస్సులు నడిచాయి. ఇక బుధవారం నుంచి పూర్తిస్థాయిలో బస్సులు రాకపోకలు సాగిస్తాయని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. బస్సులను శానిటేజేషన్​ చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందికి టీఆర్​ఎస్​ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ ఆధ్వర్యంలో మాస్క్​లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కరోనా ప్రబలకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటూనే బస్సులను ప్రారంభించారు. ఇక జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్​ కు గద్వాల డిపో నుంచి ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించాయి. పాత చార్జీలే వసూలు చేస్తున్నారని, మొదటి ట్రిప్పులో కేవలం ముగ్గురు మాత్రమే ప్రయాణికులు ఎక్కారని కండక్టర్ చెప్పారు. అలాగే మహబూబ్​ నగర్​, వరంగల్​, కరీంనగర్, ఆదిలాబాద్​, నిజామాబాద్​.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించాయి.