- హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్
వాషింగ్టన్: ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ చనిపోయిన ఘటనపై అగ్రరాజ్యం అమెరికా అట్టుడుకుటోంది. పోలీసు దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఆందోళనలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. అమెరికాలోని దాదాపు 25 నగరాల్లో కర్ఫ్యూ విధించినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. వారి నిరసనలు వైట్ హౌస్ వరకు తాకాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సోమవారం సాయంత్రం వైట్‌హౌస్‌లోని రోజ్ గార్డెన్‌లో మీడియాతో మాట్లాడారు. అల్లర్లు అదుపుచేయపోతే ఆర్మీని రంగంలోకి దించుతామని హెచ్చరించారు. నేషనల్ గార్డ్స్‌ను రాష్ట్రాల్లోకి అనుమతించాలని మేయర్లు, గవర్నర్లకు ఆదేశించారు.
దేశ శాంతి, భద్రతలను కాపాడడం తమ కర్తవ్యమని, దానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. ట్రంప్ మీడియా సమావేశానికి ముందు రాష్ట్రాల గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆందోళనకారులపై చర్యలు తీసుకోవాలని, గవర్నర్లు బలహీనంగా ఉండడం వల్లే ఈ నిరసనలు ఎక్కువయ్యాయని సీరియస్ అయ్యారు. వీలైనంత త్వరంగా నేషనల్ గార్డ్స్‌ను రంగంలోకి దింపాలని ఆదేశించారు. అంతకుముందు వైట్‌హౌస్ వద్ద శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న వారిని పోలీసులు తరిమికొట్టారు. వారిపై టియర్ గ్యాస్ ఉపయోగించి చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో ట్రంప్ బంకర్లలోకి వెళ్లిపోయారు.