- కరోనాతో ప్రముఖ జర్నలిస్టు పట్నాయకుని వెంకటేశ్వరరావు కన్నుమూత
- ‘వారం వారం తెలుగుహారం’ కార్యక్రమంతో అందరికీ సుపరిచితులు
సారథి న్యూస్, హైదరాబాద్: పాత్రికేయ శిఖరం నేలకొరిగింది.. సీనియర్ పాత్రికేయులు, రచయిత పట్నాయకుని వెంకటేశ్వర రావు(55)(వీఆర్) గురువారం సాయంత్రం కరోనాతో కన్నుమూశారు. వారం రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృత్యువాతపడ్డారు. ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా.. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. ఆంధ్రప్రభలో గ్రామీణ విలేకరిగా వృత్తిజీవితాన్ని ప్రారంభించారు. ‘ఈనాడు’లో సుమారు 17 ఏళ్ల పాటు కర్నూలు, గుంటూరు, కరీంనగర్, కడప, విజయనగరం జిల్లాల్లో పనిచేశారు. అలాగే ‘సాక్షి’లో కడప, మహబూబ్‌నగర్ ఎడిషన్లలో ఇన్చార్జ్గా పనిచేశారు. ఆంధ్రజ్యోతిలో హైదరాబాద్ సిటీ ఇన్చార్జ్ గానూ పనిచేశారు. ప్రస్తుతం ‘సాక్షి’ సెంట్రల్ డెస్క్‌లో పనిచేస్తున్నారు. జర్నలిస్టుగా, రచయితగా ఎన్నో రచనలు చేశారు. శ్రీకాకుళం భాష యాసలో కథలు రాయడంలో ఆయన దిట్ట. ప్రతి ఆదివారం ‘వారం వారం తెలుగుహారం’ పేరుతో 110 వారాల పాటు ఎన్నో ఎంతోమంది భాషాభిమానుల ద్వారా తెలుగు భాషా ఔనత్యాన్ని చెప్పించారు. ‘గుండెచప్పుళ్లు’ పేరుతో కవితా సంకలనం వెలువరించారు. ఆయన మృతిపట్ల పలువురు జర్నలిస్టులు, భాషాభిమానులు సంతాపం తెలిపారు.