న్యూఢిల్లీ: భారత జట్టుకు కోచ్‌గా ఎంపికవడానికి తనకు ఏడు నిమిషాల సమయం పట్టిందని దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ గ్యారీ కిర్‌స్టెన్ వెల్లడించాడు. తనకు ఆసక్తి లేకపోయినా.. కనీసం దరఖాస్తు చేయకపోయినా ఆ పదవి తనకు దక్కిందన్నాడు. దీనికంతటికి కారణం అప్పటి సెలెక్షన్ కమిటీ మెంబర్, దిగ్గజ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్ అని స్పష్టం చేశాడు.
‘2007లో గ్రెగ్ చాపెల్ వారసుడి కోసం బీసీసీఐ అన్వేషిస్తోంది. ఆ సమయంలోనే నాకు టీమిండియాకు కోచింగ్ ఇచ్చే ఆసక్తి ఉందా? సన్నీ నుంచి మెయిల్ వచ్చింది. ఇదేదో గాలివార్త అనుకుని రిప్లై కూడా ఇవ్వలేదు. ఇంటర్వ్యూకు వస్తావా? అని రెండో మెయిల్ వచ్చింది. సరే ఓ సారి చూద్దామని భారత్‌కు వచ్చా. నాకు అనుభవం లేకపోవడంతో నన్నెవరు ఎంపిక చేస్తారులే అనుకుని ఇంటర్వ్యూకు వెళ్లా. అక్కడ కుంబ్లే చూసి.. నీవు ఇక్కడేం చేస్తున్నావని అడిగాడు. నీకు కోచింగ్ ఇవ్వడానికి వచ్చానని చెప్పడంతో పగలబడి నవ్వాడు. కొద్దిసేపటి తర్వాత నేను లోపలికి వెళ్లిపోయా’ అని కిర్ స్టెన్ తెలిపాడు. ఇంటర్వ్యూలో ముందుగా బీసీసీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన రీతిలో సమాధానం చెప్పలేకపోయానన్నాడు.
‘టీమిండియా భవిష్యత్ గురించి నీ ఆలోచనలు ఏంటి? అని నన్ను అడిగారు. అయితే నేను సరిగా సన్నద్ధం కాలేదని చెప్పడంతో వాళ్లు మిన్నకుండిపోయారు. కానీ.. సరిగ్గా అదే సమయంలో రవిశాస్త్రి.. భారత్‌ను ఓడించడానికి దక్షిణాఫ్రికా ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుందని అడిగాడు. నాకు తెలిసిన రీతిలో ఓ మూడు నిమిషాల పాటు జవాబిచ్చా.అక్కడ ఉన్న వారికి నచ్చడంతో వెంటనే కాంట్రాక్ట్ పేపర్లపై సంతకాలు చేయమని ఇచ్చారు. ఆ పేపర్లపై గ్రెగ్ చాపెల్ పేరు ఉండడంతో కాస్త విస్తుపోయా. వెంటనే ఈ విషయాన్ని బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్లు పెన్నుతో ఆ పేరు కొట్టేసి నా పేరు రాశారు. ఏడు నిమిషాల వ్యవధిలో జరిగిన వ్యవహారంలో నేను టీమిండియాకు కోచ్‌గా ఎంపికయ్యా’ అని ఆనాడు జరిగిన సంఘటనలను గ్యారీ గుర్తు చేసుకున్నాడు. ఏమాత్రం కోచింగ్ అనుభవం లేకపోయినా.. టీమిండియా ఆల్‌టైమ్ జాబితాలో అత్యంత విజయవంతమైన కోచ్‌గా గ్యారీ పేరు తెచ్చుకున్నాడు. 2009లో టెస్టుల్లో నంబర్‌వన్, 2011లో వన్డే వరల్డ్ కప్ అందించాడు.