- పేదలు జూబ్లీహిల్స్ లో నివసించడం ఆయనకు ఇష్టం లేదు
- అధికారంలోకి వచ్చిన వెంటనే అంబేద్కర్ నగర్ వాసులకు ఇళ్లపట్టాలు
- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ భరోసా
సామాజికసారథి, హైదరాబాద్: బీఎస్పీ పేదల పార్టీ అని, బస్తీల్లో పుట్టిన పార్టీ అని.. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ముప్పై ఏళ్లుగా నివసిస్తున్న జూబ్లీహిల్స్ లోని రోడ్డు నం.46లోని అంబేద్కర్ నగర్ వాసులకు ఇళ్లస్థలాలకు పట్టాలు ఇస్తామని మాటిచ్చి, ఇళ్లు నిర్మించుకోడానికి అనుమతిచ్చి రాత్రికిరాత్రే కూల్చివేయడాన్ని ఆయన ఖండించారు. మంగళవారం ఆయన బాధితులను పరామర్శించారు.
పేదలు జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతంలో నివసించడం ఇష్టం లేకనే ఎమ్మెల్యే దానం నాగేందర్ పేదలపై గూండాగిరీ, దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్లస్థలాలకు పట్టాలు ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ఇక్కడి బస్తీకి వచ్చి ఒక్కరోజు వారితో గడిపితే స్థానికుల బాధలు అర్థమవుతాయని హితవు పలికారు. దమ్ముంటే సీఎం కేసీఆర్బస్తీలను సందర్శించాలని డిమాండ్ చేశారు. బస్తీ ప్రజలను ఆదుకుని ఇక్కడి పేద పిల్లలకు ఉన్నతవిద్య అందించి వారిని విదేశాల్లో చదివేలా అవకాశాలు కల్పిస్తామని భరోసా కల్పించారు. బస్తీవాసులంతా ఏనుగు గుర్తుకు ఓటు వేసి బీఎస్పీని ఆదరించాలని కోరారు. బస్తీవాసులతో మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏడేళ్లుగా డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ఇంకా పూర్తికాలేదని, వర్షాకాలంలో పేదలకు ఇళ్లు, టాయిలెట్ సౌకర్యాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. తిరిగి మళ్లీ ఓట్ల కోసం వచ్చే ఆధిపత్యపార్టీల నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు.