- కూటమి నుంచి వైదొలిగిన శిరోమణి అకాలీదళ్
- రైతులు, పంజాబీల ప్రయోజనాలే ముఖ్యమన్న బాదల్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణ బిల్లులు ప్రధాని మోడీ సర్కార్ కు కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలిగిన శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడీ) తాజాగా మోడీ సర్కార్ కు మరో షాక్ ఇచ్చింది. ఎన్డీయే నుంచి తాను వైదొలుగుతున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ మేరకు శనివారం చండీగఢ్ లో సమావేశమైన అకాలీదళ్ కోర్ కమిటీ.. ఈ ప్రకటన చేసింది. తమకు రైతులు, పంజాబీల ప్రయోజనాలే ముఖ్యమని తేల్చిచెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన రైతు బిల్లులు ప్రాణాంతకమైనవని ఆరోపించింది. ఈ సందర్భంగా ఎస్ఎడీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ మాట్లాడుతూ.. అగ్రి బిల్లులు రైతుల పాలిట శాపంగా మారతాయని తాము హెచ్చరించినా కేంద్ర ప్రభుత్వం మొండివైఖరి వీడలేదని విమర్శించారు.
అంతేగాక జమ్మూకాశ్మీర్లో పంజాబీ భాషను అధికారిక భాషగా చేయకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు రైతుల ప్రయోజనాలే ముఖ్యమని, అందుకే సుదీర్ఘకాలం పాటు కొనసాగినా.. రైతు వ్యతిరేక బిల్లులు తెస్తున్న ఎన్డీయే నుంచి వైదొలగడానికి నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఇదే విషయంపై ఇటీవలే కేంద్ర మంత్రి గా రాజీనామా చేసిన హర్ సిమ్రత్ కౌర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… 3 కోట్ల పంజాబీల ఆవేదనను పట్టించుకోని ప్రభుత్వంలో తాము కొనసాగబోమని స్పష్టంచేశారు. కాగా ఎన్డీయే నుంచి వేరుపడ్డ పెద్ద పార్టీల్లో అకాళీదల్ మూడోది. అంతకుముందు ఎన్డీయే నుంచి టీడీపీ, శివసేన వైదొలిగిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా.. శనివారం మధ్యాహ్నం శివసేన నాయకుడు సంజయ్ రౌత్ తో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమావేశమవడం చర్చనీయాంశంగా మారింది.