Breaking News

ఎటూ తెగని భూమి పంచాయితీ

ఎటూ తెగని భూమి పంచాయితీ

సారథి న్యూస్, నర్సాపూర్: భూసమస్య చిన్నదే.. కానీ ఏళ్ల తరబడి అలాగే కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు.. అధికారులూ పరిష్కరించడం లేదు. ఫలితంగా బాధిత రైతులు ఆఫీసర్ల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోతున్నారు. శివంపేట భూ సర్వేనం.315, 316లో దొంతి దొర ఇనాం భూములు కావడంతో అప్పట్లో రైతులు సంబంధిత వంశస్థుల నుంచి కొనుగోలుచేసి పట్టాలు పొందారు. 1954- 55 రెవెన్యూ కాస్రా రికార్డు ప్రకారం 315లో 533 ఎకరాల 28 గుంటలు, 316లో 574 ఎకరాల 35 గుంటల భూమి నమోదై ఉంది. రికార్డుకు అనుగుణంగా అమ్మకాలు, కొనుగోళ్లు జరిగాయి. అప్పటినుంచి ఇప్పటి వరకు రెవెన్యూ రికార్డుల్లో పట్టా భూములుగా ఉండడంతో రైతులు పట్టా పాస్ బుక్కులను తీసుకుని బ్యాంకు రుణాలు సైతం పొందారు.

నకిలీ పట్టాబుక్కులతో రుణాలు

ఇదే సర్వే నంబర్లలో రికార్డులో ఉన్న విస్తీర్ణం కంటే ఎక్కువగా 256 ఎకరాల్లో నకిలీ పట్టాదారులు వెలుగు చూడడంతో అసలైన పట్టాదారులు ఇబ్బందులు పడవలసి వచ్చింది. గతంలో పనిచేసిన కొందరు రెవెన్యూ సిబ్బంది చేతివాటం ప్రదర్శించి నకిలీ పట్టాలు జారీచేయడంతో దర్జాగా బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. రెవెన్యూ భూప్రక్షాళనలో భాగంగా అసలైన పట్టాదారులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రెవెన్యూ సిబ్బంది రెండేళ్ల క్రితం భూముల సర్వేచేసి నకిలీ పట్టాదారులను గుర్తించారు. వారి పేర్లను రికార్డులో నుంచి తొలగించాలని ఉన్నతాధికారులకు నివేదించారు. అసలైన పట్టాదారులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు రాకపోవడంతో బ్యాంకు రుణాలు పొందకపోవడం, పెట్టుబడి సాయం, బీమా పథకాలు వర్తించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు భూములు అమ్ముకొని నకిలీ పత్రాలు సృష్టించి అసలైన పట్టాదారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

1968లో అటవీశాఖ గెజిట్
315, 316 సర్వే నంబర్లలో అటవీ భూములు ఉన్నాయని, అందుకు సంబంధించిన ఆ శాఖ 1968 గెజిట్ విడుదల చేసింది. 315లో 220 ఎకరాలు, 316 లో 456 ఎకరాల 35 గుంటల భూమి ఉన్నట్లు అటవీశాఖ ఇచ్చిన గెజిట్ లో పేర్కొంది. ఈ సర్వే నంబర్లలో భూమి పట్టా ఉండడంతో కొందరు రైతులు బోరుబావులు తవ్వించి సాగు చేసుకుంటున్నారు. అటవీశాఖ గెజిట్​ లో ఉండడంతో కొత్త పాస్ బుక్కులను రైతులకు జారీ చేయలేదు. అటవీ భూములు సర్వే చేసే పనులు మొదలుపెట్టారు. సిబ్బంది పట్టా భూముల్లో అటవీ భూములు ఉన్నట్లు చూపుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ భూములకు సంబంధించి ఆ శాఖ ఏర్పాటుచేసిన హద్దులు, కందకం దాటి రైతుల పట్టా భూముల్లోకి వచ్చి కొలతలు చేస్తుండడంతో రైతులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. సమీపంలోని తాళ్లపల్లి, శంకర్ తండాలు అటవీ భూముల్లోకి వస్తాయని చెప్పడంతో గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. మా సాగు భూములు, నివాసగృహాల జోలికొస్తే దీటుగా ఎదుర్కొంటామని తండావాసులు హెచ్చరిస్తున్నారు.
లభించని పరిష్కారం
శివంపేటలో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించాలని మండల పర్యటనకు వచ్చిన మంత్రి హరీశ్​ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్ దృష్టికి తీసుకెళ్లిన ఇప్పటికీ పరిష్కారం లభించలేదు.
రైతులూ.. ఆందోళన వద్దు
315, 316 సర్వే నంబర్లలో భూములు సాగు చేసుకుంటున్న రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దు. అటవీ రెవెన్యూ భూముల నిర్ధారణ గురించి సర్వేచేస్తాం. సర్వే అనంతరం ప్రభుత్వానికి నివేదిస్తాం.త్వరలోనే ఈ సర్వే నంబర్లలో భూసమస్యలను పరిష్కరించి రైతులకు న్యాయం చేస్తాం. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొంత ఆలస్యమైంది. త్వరలోనే రైతులందరికీ నోటీసులు జారీచేసి నకిలీ పట్టాలను రద్దుచేసి అసలైన రైతులకు న్యాయం చేస్తాం.
:: నగేష్, జిల్లా అడిషనల్​ కలెక్టర్, మెదక్​