సారథి న్యూస్, అచ్చంపేట: కరోనా వ్యాప్తి.. లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం విక్రయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన విషయం తెలిసిందే. కానీ ఎక్సైజ్ అధికారులను మచ్చిక చేసుకుని తమ చీకటిదందా కొనసాగించాలని భావించిన కొందరు మద్యం వ్యాపారులు వారికి విందు భోజనాలు ఏర్పాటుచేశారు. అధికారులు కూడా తనిఖీల పేరుతో తమ పని కానిచ్చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో శుక్రవారం వెలుగుచూసిన ఈ ఘటన.. ఎక్సైజ్ అధికారుల పనితీరును ప్రశ్నిస్తోంది. అచ్చంపేటలో మద్యం వ్యాపారులంతా ఎక్సైజ్ ఎన్ ఫోర్స్మెంట్ అధికారులకు పట్టణ శివారులో భోజనాలు ఏర్పాటు చేయడం, అదికాస్త బయటపడడంతో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
అధికరేట్లకు మద్యం విక్రయాలు
అచ్చంపేట పట్టణంతో పాటు వివిధ మండలాల్లోని వైన్స్ షాపులను గుట్టుచప్పుడు కాకుండా తెరిచి మద్యంను ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నారని కొందరు ఎక్సైజ్ కమిషనర్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ సీఐ ప్రభాకర్ తన సిబ్బందితో రెండు రోజులుగా అచ్చంపేట ప్రాంతాల్లో అక్రమంగా దాచిపెట్టిన మద్యం కోసం తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే వచ్చిన అధికారులను మచ్చిక చేసుకోవడానికి మద్యం వ్యాపారులు కొందరు పల్కపల్లి గ్రామసమీపంలోని ఓ కోళ్లఫారం షెడ్డులో విందు భోజనాలు ఏర్పాటుచేశారు. విషయం తెలుసుకున్న స్థానిక మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లగా అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఫొటోలు తీస్తుండగా సీఐ ముఖం చాటేశారు. ఇది గమనించిన మద్యం వ్యాపారులు ఒక్కొక్కరుగా అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు.
సీఐ ఏమన్నారంటే..
కోళ్లఫాం షెడ్డు పక్కనే అధికారులు వారి వెహికిల్ నిలిపారు. మీడియా ప్రతినిధులు వచ్చినట్లు సిబ్బంది భోజనాలు చేయకుండా కోళ్ల షెడ్డు పరిసరాలను తనిఖీ చేస్తున్నట్లు నటిస్తూ కనిపించారు. ఈ విషయమై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ సీఐ ప్రభాకర్ వివరణ ఇస్తూ.. మామిడితోట, గడ్డివాములో తనిఖీలు చేయడానికి వచ్చామని, లాక్ డౌన్ వల్ల భోజనానికి ఇబ్బందిగా ఉన్నందుకు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు.