- ఎస్పీబి మృతిపై ఇళయరాజా దిగ్భ్రాంతి
చెన్నై : గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం మృతిపై భారతీయ సంగీత లోకం కన్నీటి నివాళులర్పిస్తోంది. బాలు మరణంపై ఆయన ప్రాణమిత్రుడు, మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఎక్కడికెళ్లావ్ బాలూ..!’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎస్పీబీ మరణవార్త తెలియగానే ఆయన స్పందిస్తూ… ‘ఎక్కడికి వెళ్లిపోయావ్ బాలు. త్వరగా కోలుకుని రమ్మని చెప్పాను. కానీ నూవ్ నా మాట వినలేదు. ఎక్కడికెళ్లావ్. అక్కడ గంధర్వుల కోసం పాడడానికి వెళ్లావా..? నూవ్ లేని ఈ ప్రపంచం చీకటైపోయింది. నాకేం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఎంతటి బాధకైనా ఒక హద్దుంటుంది. కానీ ఇది అవధుల్లేని బాధ..’ అంటూ కంటనీరు పెట్టుకున్నారు ఇళయరాజా.. ఇద్దరి కాంబినేషన్ లో వేలాది సూపర్ హిట్ గీతాలొచ్చాయి. దాదాపు మూడు దశాబ్దాల పాటు దక్షిణాదిన ఇళయరాజా సంగీతం, బాలు పాట లేని సినిమా రాలేదంటే అతిశయోక్తి కాదు. ఒకరకంగా చెప్పాలంటే ఆ కాలంలో ఈ సంగీత జ్ఞానులు సినీ సంగీత జగత్తును ఏలారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంగీత ద్వయాలు ఉన్నా.. బాలు, రాజాల కాంబినేషన్ క్రేజే వేరు. ఈ ఇద్దరూ కలిసి దేశవ్యాప్తంగా వేలాది కచేరీలు చేశారు. అసలు బాలు లేకుండా ఇళయరాజా సంగీతం అందించిన సినిమాలు లేవనే చెప్పాలి.