Breaking News

ఉప్పొంగిన సరళా తరంగం

ఉప్పొంగిన సరళా తరంగం
  • వనపర్తి సంస్థానాధీశుల కాలంలో నిర్మాణం
  • ఆసియా ఖండంలోనే మొదటి ప్రాజెక్టు

సారథి న్యూస్, వనపర్తి: ఇటీవల కురుస్తున్న భారీవర్షాలకు వనపర్తి జిల్లాలో వనపర్తి సంస్థానాధీశుల కాలం నాటి సరళాసాగర్​ సైఫన్లు దూకాయి. పరిసరాల ప్రాంతాలతో పాటు సరళాసాగర్​ ఎత్తిపోతల, కల్వకుర్తి లిఫ్ట్​ఇరిగేషన్​పథకాల నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆటోమెటిక్​సైఫన్​సిస్టం నుంచి కృష్ణాజలాలు బిరబిరా పరుగులు తీస్తున్నాయి. సరళాసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 22 అడుగులు. ఆసియా ఖండంలోనే మొట్టమొదటి ప్రాజెక్టు ఇది.
ఇదీ సైఫన్​ సిస్టం
ఆటోమేటిక్‌ సైఫన్‌ సిస్టం అంటే.. ప్రాజెక్టులోని నీరు పూర్తి మట్టానికి చేరుకోగానే సైఫన్లు వాటంతట అవి తెరుచుకోవడం. అప్పట్లో ఈ ఆధునిక టెక్నాలజీతో నిర్మించిన ఆసియాలోనే రెండవ ప్రాజెక్టు ఇది. 17 వుడ్‌ సైఫన్లు, 4 ప్రీమింగ్‌ సైఫన్లతో 391 అడుగుల వెడల్పుతో మెయిన్‌ సైఫన్‌ను నిర్మించారు. ఒక్కో సైఫన్‌ నుంచి 520 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. మట్టికట్ట పొడువు 3,537 అడుగులు, రాతికట్ట పొడువు 520 అడుగులు, కట్ట గరిష్ట ఎత్తు 45.2 ఫీట్లు, నికర నీటినిల్వ 22 అడుగులు, 491.37 ఎంసీఎఫ్‌టీ, నీటి విస్తరణ ప్రదేశం రెండు చదరపు మైళ్లు, కుడి కాల్వ 8 కి.మీ, ఎడమకాల్వ 20 కి.మీ.లు ప్రవహిస్తూ ఆయకట్టుకు నీరందిస్తున్నాయి.
సంస్థానాధీశుల హయాంలో పునాదిరాయి
1947 జులై 10న వనపర్తి సంస్థానాధీశుల చివరి రాజు, కేంద్ర మాజీ మంత్రి రాజారామేశ్వర్‌రావు తన తల్లి సరళాదేవి పేరు మీద రూ.30లక్షల వ్యయంతో నిర్మించేందుకు సరళాసాగర్ కు భూమి పూజచేశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆటోమేటిక్‌ సైఫన్‌ సిస్టం అనే టెక్నాలజీతో దీన్నినిర్మించారు. 1959 మే 1న ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. అప్పటి నిజాం ప్రభుత్వ గవర్నర్ దీనిని ప్రారంభించారు. 1959 జులై 26న మొదటిసారి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ ఇరిగేషన్ శాఖ మంత్రి నర్సింగరావు కాల్వలకు నీళ్లు వదిలారు. 1960-1963లో భారీవర్షాలు కురవడంతో సైఫన్ల ద్వారా నీళ్లు దిగువకు దూకాయి. 1964లో కురిసిన భారీవర్షాలకు శంకరసముద్రం చెరువు కట్ట తెగపోవడంతో పాటు సరళాసాగర్ కట్ట వరద ఉధృతికి కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన కట్ట స్థానంలో అలుగును నిర్మించారు. అయితే 20 ఏళ్లలో 1998, 2009లో సైఫన్లు దూకాయి. గత డిసెంబర్ 31న సరళాసాగర్ కట్ట తెగపోవడంతో నిండుకుండ లాంటి ప్రాజెక్టులోని అర టీఎంసీ నీరు వృథాగా పోయింది. టన్నులకొద్దీ చేపలు ఇసుకలో కూరుకుపోయి చనిపోయాయి. రూ.ఆరుకోట్ల వ్యయంతో మరమ్మతులు చేపట్టి గండిపూడ్చారు. ఈనెల 16వ తేదీన సరళాసాగర్ సైఫన్లు తెరుచుకుని మరోసారి నీళ్లు దూకాయి.

SARATHIMEDIA RECORDED