న్యూఢిల్లీ: కెప్టెన్ విరాట్ కోహ్లీ, హిట్‌మాన్ రోహిత్ శర్మలాంటి ఆటగాళ్లతో కలిసి ఆడటం తన అదృష్టమని భారత జట్టు ఓపెనర్ శిఖర్ ధవన్ అన్నాడు. జట్టులో ప్రతి ఒక్కకరు చాలా ప్రత్యేకంగా ఉంటారన్నాడు. ‘ టీమ్‌లో ప్రతి ఒక్కరు చాలా స్పెషల్. వీళ్లంతా కలిసి జట్టుగా ఆడటం మరింత అద్భుతం. ప్రతి ఒక్కరి వ్యక్తితత్వం చాలా భిన్నంగా ఉంటుంది. వాళ్లలో ఉండే శక్తి, స్ఫూర్తి.. అత్యుత్తమ మేళవింపుకు దోహదపడుతున్నది. ఆరంభంలో కుదురుకోవడానికి రోహిత్ కాస్త సమయం తీసుకున్నా. ఆ తర్వాత అంతా విధ్వంసమే. ప్రత్యర్థి జట్టులో ఏ ఒక్కరు అతన్ని ఆపలేరు. ఇక కోహ్లీ మరో అద్భుతం. నిలబడ్డాడంటే బౌలర్లకు చుక్కలు కనిపించాల్సిందే. క్లిష్ట పరిస్థితుల్లోనూ నిలకడగా ఆడటంతో అతన్ని మించినోళ్లు లేరు. అందుకే ఈ తరంలో వాళ్లతో కలిసి ఆడటం నా అదృష్టం’ అని ధవన్ వ్యాఖ్యానించాడు. ఇతరులతో పోల్చుకుంటే ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా వస్తాయన్నాడు. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరిగిపోతుందన్నాడు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సానుకూలంగా ఆలోచించడమే తన బలమని చెప్పాడు. ఇందుకోసం యోగా చేస్తానని, దీనివల్ల మానసికంగా, శారీరకంగా బలంగా ఉండొచ్చని ధవన్ చెప్పుకొచ్చాడు. ‘మనలో ఉన్న నైపుణ్యానికి ఎలా మెరుగులు దిద్దుకుంటామో.. మైండ్ సెట్‌ను కూడా అలాగే కాపాడుకోవాలి. జీవితంలో సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి. నాలో ఈ శక్తి ఉంది కాబట్టే నేనింకా క్రికెట్ ఆడుతున్నా. ఒకవేళ నేను సున్నాకే ఔటైనా.. సానుకూలంగానే తీసుకుంటా. అలాగని ఎందుకు ఔటయ్యానని విశ్లేషణ చేసుకోనని కాదు. నా తప్పులను అర్థం చేసుకుని అధిగమించేందుకు కృషి చేస్తా’ అని శిఖర్ వివరించాడు.
- June 20, 2020
- Archive
- క్రీడలు
- DHAVAN
- KOHLI
- ROHITH
- ఒత్తిడి
- శిఖర్ ధవన్
- Comments Off on ఈ తరంలో ఆడటం నా అదృష్టం