Breaking News

ఈ-ఆఫీస్ ద్వారానే ఫైళ్లు

ఈ-ఆఫీస్ ద్వారానే ఫైళ్లు

సారథి న్యూస్, ములుగు: కార్యాలయ ఫైళ్లను ఈ-ఆఫీస్ ద్వారానే సమర్పించాలని, మ్యానువల్ ఫైళ్లు పరిశీలించబోమని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణ ఆదిత్య అన్నారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఈ-ఆఫీస్ ద్వారా పాలనకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా అధికారులందరికీ వారి వారి లాగిన్ ఐడీలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఆయా శాఖల అధికారులంతా సెక్షన్ల వారీగా కరంట్ ఫైళ్లు, ముగింపు ఫైళ్ల వివరాలు సమర్పించాలన్నారు. కార్యాలయంలో నిర్వహించనున్న ఫైళ్ల వివరాలను స్కాన్ చేసి ఈ-ఆఫీస్ లో పొందుపర్చాలని సూచించారు. అధికారులు, సిబ్బందికి ఇప్పటికి ఈ-ఆఫీస్ నిర్వహణపై శిక్షణ ఇచ్చామని, సందేహాలు ఉంటే కలెక్టరేట్ ఈడీఎంను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు.

జిల్లా హ్యాండ్ బుక్ రూపకల్పనకు అధికారులు తమ శాఖ వివరాలు సమర్పించాలన్నారు. ప్రతి చెరువుల్లో చేపల పిల్లల విడుదలపై ఎప్పటికప్పుడు సూచనలు అమలు చేయాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో వ్యక్తిగత శ్రద్ధ వహించాలన్నారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు, ఫిర్యాదుల విషయమై వెంటనే చర్యలు తీసుకుని పరిష్కరించాలని సూచించారు. సమీక్షలో ఎస్పీ డాక్టర్​సంగ్రామ్ సింగ్ జి.పాటిల్, డీఆర్వో కె.రమాదేవి, సీపీవో ఐ.రవికుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, డీసీవో విజయభాస్కర్ రెడ్డి, డీటీవో జర్సన్ కుమార్, డీటీడబ్ల్యూవో ఎర్రయ్య, డీఎంహెచ్​వో డాక్టర్​ ఎ.అప్పయ్య, డీపీవో వెంకయ్య పాల్గొన్నారు.