Breaking News

ఇది మరిచిపోలేని రోజు

ఇది మరిచిపోలేని రోజు

 ఇది మరిచిపోలేని రోజు. – మంత్రి హరీశ్ రావు

సారథి న్యూస్, మెదక్: సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం దలాపూర్ వద్ద నిర్మించిన రంగనాయకసాగర్ ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాల్వలకు మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, సిద్దిపేట జడ్పీ చైర్ ​పర్సన్​ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, రసమయి బాలకిషన్ పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు.

అంతకుముందు ఇరిగేషన్ ఇంజనీర్ హరిరాం మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ టన్నెల్ 4వ గేట్ ఎత్తి నీటిని వదిలారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రంగనాయక్ సాగర్ నుంచి కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని విడుదల చేయడం మరుపురాని రోజు అని గుర్తుచేశారు.

ఈ రోజు కోసం రైతులు ఎన్నో తరాలుగా ఎదురుచూశారని, వారి కల నెరవేర్చడం ఆనందంగా ఉందన్నారు. కాల్వల వెంట బిరబిరా గోదారమ్మ పరుగులు తీస్తుంటే రైతుల కళ్లల్లో ఆనందభాష్పాలు కారుతున్నాయన్నారు.

ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరించిన సీఎం కేసీఆర్, ఇంజనీర్లు, కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. రైతులకు మంచిరోజులు వచ్చాయని పేర్కొన్నారు. ప్రధాన కుడికాల్వ ద్వారా 40వేల ఎకరాలు, ఎడమకాల్వ ద్వారా 70వేల ఎకరాలు సాగునీరు అందుతుందని మంత్రి వెల్లడించారు.

నీటి విడుదల అనంతరం
మంత్రి హరీశ్​ రావు సంతోషం

ఈత కొట్టిన ఎంపీ, ఎమ్మెల్యే

నీటిలో ఎంపీ కేపీఆర్​,
ఎమ్మెల్యే రసమయి కేరింత

ప్రధాన ఎడమ కాల్వలో గోదావరి జలాలు ప్రవహిస్తుండడంతో ఎంపీ, ఎమ్మెల్యేలపై చల్లుతూ మంత్రి హరీశ్ రావు ఆనందం వ్యక్తంచేశారు.

ఈ సందర్భంగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చిన్నకోడూర్, నారాయణ రావుపేట మండలాల ప్రజాప్రతినిధులు కాల్వలో ఈతకొట్టారు.

మంత్రి హరీశ్ రావు తదితరులు సెల్ఫీలు దిగి నీళ్లు విడుదలైన సంబురాన్ని పంచుకున్నారు.