- కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆందోళన
- రెగ్యులర్ పరీక్షల నిమిత్తమే..
- ఆస్పత్రి చైర్మన్ డీఎస్ రాణా వెల్లడి
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఆమె ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు రావడంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. అయితే.. ఆమె రెగ్యులర్ పరీక్షల కోసమే ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. గురువారం (జులై 30) సాయంత్రం 7 గంటలకు ఆమె న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తమే సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారని.. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి చైర్మన్ డీఎస్ రాణా తెలిపారు. సోనియాగాంధీ గురువారం ఉదయం కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులతో వర్చువల్ మీటింగ్‌లో పాల్గొన్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలు, కరోనా పరిస్థితిపై వారితో చర్చించారు. సోనియాగాంధీ కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. విదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. ఇదే ఏడాది ఫిబ్రవరిలోనూ ఆమె గంగారామ్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. కడుపు నొప్పి కారణంగా ఆమె ఆస్పత్రిలో చేరారు.