- టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారిన పడకుండా.. జీవ రక్షణ వాతావరణంలో (బయో సెక్యూర్ ఎన్విరాన్మెంట్) క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడం అసాధ్యమని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ఇందంతా ఓ మిథ్య అని కొట్టిపడేశాడు. ఆట రెండవ రోజు ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే ఏం చేస్తారని ప్రశ్నించాడు. పాకిస్థాన్, వెస్టిండిస్ తో జరిగే సిరీస్‌లను బయోసెక్యూర్ వాతావరణంలో నిర్వహిస్తామని ఈసీబీ ప్రకటించిన నేపథ్యంలో ద్రవిడ్ పైవిధంగా స్పందించాడు. ‘చాలా రోజుల నుంచి క్రికెట్ లేకపోవడంతో ఈసీబీ అలా ఆలోచిస్తుందేమో. కానీ బయోసెక్యూర్లో క్రికెట్ పునరుద్ధరించడం సాధ్యం కాదు.
ఒకవేళ బబుల్ (రక్షణ వలయం) సృష్టించినా.. అది ప్రతి ఒక్కరికీ సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారం చాలా ప్రయాణాలు చేయాలి. మధ్యలో చాలా మంది కలుస్తుంటారు. మ్యాచ్ కు ముందు పరీక్షలు, క్వారంటైన్ చేసినా, రెండో రోజు పాజిటివ్ వస్తే ఏం చేస్తారు. ఇప్పుడున్న ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందర్ని క్వారంటైన్‌కు పంపించాలి. మరి అలా చేస్తారా? చేస్తే మ్యాచ్ పరిస్థితి ఏంటీ? ఇలాంటి సందర్భాల్లో టెస్ట్ మ్యాచ్‌లు సాధ్యం కావు. దీనివల్ల మనం చేసిన ఖర్చుమొత్తం వృథా అవుతుంది. కాకపోతే ఒక ఆటగాడికి పాజిటివ్ వస్తే మొత్తం టోర్నీ రద్దవ్వకుండా ఏం చేయాలని ప్రభుత్వంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి’ అని ద్రవిడ్ సూచించాడు. ప్రొఫెషనల్ స్థాయిలో ఉండే క్రీడాకారులంతా ప్రతిఒక్క దానికి అలవాటుపడాల్సిన అవసరం ఉందన్నాడు. ప్రదర్శనలపై ఇతర ప్రభావాలు లేకుండా చూసుకోవాలన్నాడు. అభిమానుల ముందు ఆడటానికే చాలా మంది క్రికెటర్లు ఇష్టపడతారని చెప్పిన ద్రవిడ్.. భయం, ఆందోళనను వదిలేసి నియంత్రించే అంశాలపై దృష్టి సారించాలన్నాడు.