Breaking News

అర్హులైన రైతులందరికీ ఉచితంగా బోర్లు

అర్హులైన రైతులందరికీ ఉచితంగా బోర్లు

సారథి న్యూస్​, కర్నూలు: రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచితంగా బోర్లు వేరి, తద్వారా మెట్ట భూములకు సాగునీరు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్‌ జలకళ పథకాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి సీఎం జగన్​ అన్ని జిల్లాల కలెక్టర్ లు, జేసీలు, ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైఎస్సార్‌ జలకళ పథకం శ్రీకారం చుట్టి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ ‘వైఎస్సార్​ జలకళ’ కోసం రూ.2,340 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. చిన్న, సన్నకారు రైతులకు బోర్లు వేయించడంతో పాటు మోటార్లు బిగించడంతో కోసం మరో రూ.1,600 కోట్లు ఖర్చుచేస్తున్నామని తెలిపారు. వలంటీర్ల సహకారంతో గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. బోర్‌ ఎక్కడ వేస్తే నీళ్లు పడతాయన్న సర్వే కూడా చేస్తామన్నారు.

బోర్‌ వేసేందుకు, సర్వే ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇప్పటికే రైతులు వేసుకున్న బోర్లు ఫెయిలైతే.. మళ్లీ వేయిస్తాం అన్నారు. విద్యుత్ బిల్లుల డబ్బును రైతుల అకౌంట్‌లో వేస్తామన్నారు. రైతులే నేరుగా విద్యుత్ బిల్లులు చెల్లిస్తారని చెప్పారు. విద్యుత్‌ సరఫరాలో లోపాలుంటే రైతుకు ప్రశ్నించే హక్కు ఉంటుంది కావునా రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. 10వేల మెగావాట్ల సోలార్‌ పవర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నామని, యూనిట్‌ రూ.2.30కే అందుబాటులోకి వస్తుంది. రైతులపై విద్యుత్‌ భారం మోపుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

దుష్ప్రచారం చేస్తున్న వారిని రైతులే నిలదీస్తారన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో జనతాబజార్ తీసుకొస్తామన్నారు. స్థానిక కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె.సుధాకర్, నందికొట్కూరు ఎమ్మెల్యే తొగూరు ఆర్థర్, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) సయ్యద్ ఖాజా మోహిద్దీన్, డ్వామా పీడీ అమరనాథ రెడ్డి పాల్గొన్నారు.