‘పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ.. కదిలే దేవత అమ్మ.. కంటికి వెలుగు అమ్మా..!!’ అని ఓ సినిమా కవి చెప్పింది అక్షరాలా నిజం. అమ్మ లేనిదే సృష్టి లేదు.. అసలు మనిషికి మనుగడే లేదు. అయినా అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కారణం అమ్మ పంచే ప్రేమకు కొలమానం లేదు. దేవుడికి సైతం దక్కని అమ్మ ప్రేమ మనిషికి మాత్రమే దక్కింది. అందుకే దేవుడికి అవసరమయ్యే అమృతం.. మనిషికి అక్కర్లేదు. అలాంటి అమ్మను జీవితాంతం కొలుచుకోవాలి. బిడ్డలను ప్రేమిస్తూ.. కంటికి రెప్పలా కాపాడుకునే ప్రతి తల్లికీ..
‘హ్యాపీ మదర్స్ డే’.
పెళ్లయిన ప్రతి స్త్రీ తల్లి కావాలనుకుంటుంది. తన ప్రతిరూపాన్ని చూసుకోవాలని తహతహలాడుతుంది. బిడ్డ కడుపులోపడ్డ క్షణం నుంచి తన జీవనశైలినే మార్చుకుంటుంది. పొత్తిళ్లలో బిడ్డ ఆరోగ్యంగా పెరగాలని ఇష్టమైన ఆహారాన్ని వదులుకుంటుంది.. నచ్చిన అలవాట్లను దూరం చేసుకుంటుంది.. శరీరంలో జరగబోయే మార్పులకు శారీరకంగా, మానసికంగా సిద్ధమవుతుంది. నెలలను గడుస్తున్న కొద్దీ శరీరంలో వస్తున్న మార్పులను అలవాటు చేసుకుంటుంది. బరువు పెరుగుతున్నా.. ముఖంపై మచ్చలు వస్తున్నా.. పొట్ట పెరుగుతూ, దానిపై నల్లటి చారలు ఏర్పడుతున్నా.. ఆ తల్లి దేన్నీ పట్టించుకోదు. బిడ్డ కదులుతోందా? లేదా? అని మాత్రమే లెక్కేసుకుంటుంది. బిడ్డ కదలికలనే గుండె చప్పుళ్లుగా మార్చుకునే తల్లికి…
‘హ్యాపీ మదర్స్ డే’.
ఎప్పుడూ సన్నగా, నాజూగ్గా ఉండాలనుకునే అమ్మాయిలు.. కొంచెం బరువు పెరిగితేనే తెగ హైరానా పడిపోతుంటారు. అలాంటిది ‘అమ్మా’ అని పిలుపు కోసం ఏకంగా 15–16 కిలోల బరువు పెరిగేందుకు సంతోషంగా సిద్ధమవుతారు. ఎక్కడ నిర్లక్ష్యం చేస్తే.. బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి కొత్త రోగాలు వస్తాయో.. బిడ్డకేం జరుగుతుందోనని ఆ కాబోయే తల్లి డాక్టర్లు చెప్పే జాగ్రత్తలన్నీ పాటిస్తుంది. నార్మల్ డెలివరీ కోసం ఎక్సర్సైజులు, యోగా అంటూ పడరాని పాట్లూ పడుతుంది. దేవుడి దయవల్ల నార్మల్ డెలివరీ అయితే.. ఆ తల్లి పడే ప్రసవవేదన ఊహకందనిది. అదే కాన్పు కష్టమని తెలిస్తే.. కడుపుకోతకు సైతం సిద్ధమై మత్తు సూది ఎక్కించుకుంటుంది. పెద్ద ఆపరేషన్ వల్ల భవిష్యత్లో సమస్యలు వస్తాయని తెలిసినా.. వేటినీ పట్టించుకోకుండా చేతులో ఉన్న బిడ్డను చూసి మురిసిపోతుంది. అలాంటి అమ్మకు..
‘హ్యాపీ మదర్స్ డే’.
‘కంటేనే అమ్మ అని అంటే ఎలా? కరుణించే ప్రతి దేవత అమ్మే కదా.. కన్న అమ్మే కదా..!’ అన్న మాటలు రాసిన కవికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అవును, తల్లి బిడ్డను కనడానికి పడే కష్టం అంతాఇంతా కాదు. అయితే తన కడుపులోంచి రాని బిడ్డను.. గుండెల్లో పెట్టుకుని పెంచేంత ప్రేమ కూడా ఒక అమ్మలోనే ఉంటుంది. అమ్మతనం అంటేనే బిడ్డను ప్రేమించడం. పర్సంటేజుల కొలతలు లేని ఆ ప్రేమకు ప్రతి మనిషీ దాసోహం అవ్వాల్సిందే. అలాగే కనిపించిన ప్రతి ఆడదానిలో తన తల్లిని చూసేవాడే మనిషి. అలాంటి జ్ఞానాన్ని బిడ్డలకు అందించి, సమాజానికి ప్రేమను పంచే ప్రతి తల్లికి..
‘హ్యాపీ మదర్స్ డే’.