Breaking News

అమరుల త్యాగాలతోనే తెలంగాణ

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉట్టిగా, ఆషామాషీగా రాలేదని, వందలాది మంది అమరవీరుల ఆత్మార్పణంతో ఆవిర్భవించిందని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్​ గుర్తుచేశారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్​ నగర్​ జిల్లా కేంద్రంలో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. కలెక్టరేట్​లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యోపన్యాసం చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఓ దశలో కన్నీటి పర్యంతమయ్యారు. గద్గదస్వరంతో ప్రసంగం కొనసాగించారు.

నాటి తెలంగాణ ఉద్యమ నిర్మాత, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు నేతృత్వంలో అమలుచేస్తున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహబూబ్​ నగర్​ జడ్పీ చైర్​పర్సన్​ స్వర్ణసుధాకర్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి, డీసీసీబీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేజీ నర్సింహులు, కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రెమా రాజేశ్వరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.