సారథి న్యూస్, వరంగల్: వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి వివిధ పథకాల కింద చేపడుతున్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పమేలా సత్పతితో కలిసి 2016–19 సంవత్సరానికి మంజూరైన అభివృద్ధి పనులు, స్మార్ట్ సిటీ పనులు, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాల పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. పట్టణంలో ప్రజల మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి హామీ పథకం కింద 2016-17లో రూ.300 కోట్లతో రింగ్ రోడ్డు పనులు, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ద్వారా ధర్మసాగర్ రిజర్వాయర్ కు నీటిని పంపింగ్, పలు అంతర్గత నిర్మాణ పనులు, డివిజన్లలో పార్కులు డ్రైనేజీలు, అంతర్గత సీసీ, బీటీరోడ్డు పనులను వెంటనే చేపట్టాలన్నారు. రూ.65కోట్ల వ్యయంతో భద్రకాళి బండ్ సుందరీకరణ పనులు, రూ.65 కోట్ల వ్యయంతో నగరంలో చేపట్టిన నాలుగు రోడ్ల పనులను వేగవంతంగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ ప్రత్యేకాధికారి భాస్కర్ రెడ్డి, ట్రాన్స్కో ఎస్ఈ చౌహన్, సీపీవో, పీవో అజిత్ రెడ్డి పాల్గొన్నారు.
- June 5, 2020
- తెలంగాణ
- వరంగల్
- COLLECTOR
- WARANGAL
- దేవాదుల లిఫ్ట్
- మున్సిపల్ కార్పొరేషన్
- Comments Off on అభివృద్ధి పనులు కంప్లీట్ చేయండి